Ganesh Idols: వినాయక చవితికి విగ్రహాల కొరత
Ganesh Idols: భాగ్యనగరాన్ని జల్లెడ పడుతున్న మండప నిర్వాహకులు * కూలీలు లేకపోవడం ప్రధాన కారణం
Ganesh Idols: వినాయక చవితికి కేవలం ఒకరోజు మాత్రమే ఉంది. ఉత్సవ కమిటీ సభ్యులు గణనాథుల విగ్రహాల కోసం సిటీని జల్లెడ పడుతున్నారు. ఎక్కడ చూసినా తక్కువ సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. రేట్లు మాత్రం భగ్గుమంటున్నాయి. వాటిల్లోనూ చాలా వరకు బుక్ అయిపోయాయి. హైదరాబాద్ సిటీలో ఎక్కడ వెతికినా విగ్రహాలు మాత్రం దొరకడం లేదు. నగరంలో ఏటా 40 వేల విగ్రహాలు ప్రతిష్ఠిస్తుండగా ఈసారి సగం వరకు కూడా అందుబాటులో లేవు.
రాష్ట్రంలో కరోనా ఆంక్షలు లేనప్పటికీ వైరస్ ప్రభావం మాత్రం పడుతోంది. లాక్‌డౌన్ కారణంగా గతేడాది వినాయక విగ్రహాల ఎత్తు, మండపాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. తాజాగా నవరాత్రి ఉత్సవాలు, ప్రతిమల ఎత్తుపై ఆంక్షలేవీ లేకున్నా విగ్రహాల కొరత మాత్రం ఏర్పడింది. కొవిడ్ కారణంగా ఇతర రాష్ట్రాలకు వలస కూలీలు తిరిగి వెళ్లిపోయారు. దీంతో విగ్రహాల తయారీ భారీగా తగ్గిపోయింది. సిటీలో దాదాపు 40 వేల విగ్రహాలు అవసరం ఉంది. ఇవే కాకుండా జిల్లాలకు కూడా నగరం నుంచే తీసుకుని వెళ్తారు. 2019లో ఒక్క భాగ్యనగరంలోనే 36 వేల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ ఏడాది వీటి ధరలు సుమారు 25 శాతం వరకు పెరిగాయని కొనుగోలుదారులు చెప్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి విగ్రహాలు కొనుగోలు చేసి, తీసుకెళ్తుంటారు. ఈ సారి నగరంలో డిమాండ్‌కు తగ్గట్లు విగ్రహాలు అందుబాటులో లేవు. ఇటీవల ప్రభుత్వం విగ్రహాల ఎత్తు, మండపాల ఏర్పాటు, నిమజ్జనం, పూజల విషయంలో ఆంక్షలు ఎత్తివేయడంతో వినాయక విగ్రహాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. మండపాల్లో విగ్రహాల ఏర్పాటుకు గాను తయారీదారుల వద్దకు మండప నిర్వాహకులు పరుగులు పెడుతున్నారు.
గతేడాది భారీగా విగ్రహాలు తయారీ చేసి.. తీరా పండుగ వచ్చేసరికి ఆంక్షలు విధించడంతో నిర్వాహకులు నష్టపోయారు. ఈ ఏడాది కూలీలు దొరక్కపోవడం, కరోనా ఎఫెక్ట్ పడుతుందేమోనని ముందుగానే విగ్రహాలను తక్కువ సంఖ్యలో తయారు చేయడం కొరతకు దారీతిసింది.