Frog In Chicken Biryani: చికెన్ బిర్యానీలో కప్ప.. హాస్టల్ మెస్‌లో విద్యార్థులకు చేదు అనుభవం

Update: 2024-10-20 16:48 GMT

Frog In Chicken Biryani: హైదరాబాద్ గచ్చిబౌలిలోని త్రిపుల్ ఐటి విద్యార్థులకు ఓ చేదు అనుభవం ఎదురైంది. కాదాంబరి మెస్‌లో స్టూడెంట్స్‌కి వడ్డించిన చికెన్ బిర్యానీ ఆహారంలో కప్ప వచ్చింది. బిర్యానీ ఆరగిద్దామని దానిని తమ ముందుకు తీసుకున్న విద్యార్థులకి చికెన్ ముక్కలతో పాటే కప్ప కూడా కనిపించడం చూసి షాకయ్యారు. కళ్ల ముందున్న ఆ దృశ్యం చూసి వాళ్లకు కడుపులోంచి దేవినట్లయింది. వెంటనే కప్పతో పాటే ఆ బిర్యానీ ప్లేటును అలాగే తీసుకెళ్లి మెస్ ఇంచార్జ్ కు ఫిర్యాదు చేశారు. మెస్ బయట ఆందోళనకు దిగిన విద్యార్థులకు మెస్ ఇంచార్జ్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.

గచ్చిబౌలి త్రిపుల్ ఐటిలో అక్టోబర్ 16న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఒక విద్యార్థి ఎక్స్ ద్వారా నెటిజెన్స్ తో పంచుకున్న తరువాత ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. చికెన్ బిర్యానీ కప్ప వెలుగుచూసిన ఘటనపై నెటిజెన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు.

ఇటీవల కాలంలో హోటల్స్‌లో వడ్డించే ఆహారంలో కల్తీ జరుగుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. అదికాకుండా రెస్టారెంట్లలో వడ్డించే చికెన్ బిర్యానీలో, మటన్ బిర్యానీలో బొద్దింకలు, జెర్రీలు, బల్లులు వస్తుండటం సర్వసాధారణం అయింది. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక రెస్టారెంట్ ఇలాంటి ఘటనలతో వార్తల్లోకెక్కుతోంది. పెద్దపెద్ద పేరున్న రెస్టారెంట్లు కూడా ఇందుకు మినహాయింపేం కాదు.

రెస్టారెంట్స్ సంగతి పక్కనపెడితే, చివరకు విద్యార్థులు ఉండే హాస్టల్స్‌లో వడ్డించే ఆహారంలోనూ ఇలా కప్పలు వస్తే ఎలా అని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులకు వడ్డించే ఆహారంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజెన్స్ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. 

Tags:    

Similar News