ఇవాళ ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ

Shiva Balakrishna: చంచల్‌గూడ జైలు నుండి శివబాలకృష్ణను కస్టడీకి తీసుకోనున్న ఏసీబీ

Update: 2024-01-31 04:43 GMT

ఇవాళ ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ

Shiva Balakrishna: అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను ఇవాళ ఏసీబీ కస్టడీకి తీసుకోనుంది. చంచల్‌గూడ జైలు నుండి శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించనుంది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్‌ అయిన HMDA మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. దీంతో ఫిబ్రవరి 7 వరకు బాలకృష్ణ అక్రమాలపై విచారణ జరపనున్నారు అధికారులు.

2018 నుంచి 2023 కాలంలో HMDAలో పనిచేసిన శివబాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగింది ఏసీబీ. ‌శివబాలకృష్ణ అరెస్ట్‌కు ముందు ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వందల కోట్ల ఆస్తులున్నట్టు గుర్తించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అనుమతులిచ్చారని.. అలా అవినీతి సొమ్మును కూడగట్టారని నిర్ధారణకు వచ్చారు. దీంతో శివబాలకృష్ణ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఇచ్చిన అనుమతులు, కూడగట్టిన ఆస్తుల వివరాలను కస్టడీ విచారణలో రాబట్టేందుకు సిద్ధమైంది ఏసీబీ.

కన్జర్వేషన్‌ జోన్‌లలో ఉన్న భూములను కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ జోన్‌లుగా అనుమతించడం వంటి అక్రమాలతో పాటు మార్టుగేజ్‌ ప్లాట్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం.. ఇండస్ట్రీ ప్రాంతాల్లో నివాస సముదాయాలు, హైరైజ్ భవనాలకు అనుమతులు లాంటి అన్ని అంశాలపై సుదీర్ఘ విచారణకు సిద్ధమైంది ఏసీబీ. శివ బాలకృష్ణ పనిచేసిన సమయంలోని ప్రాజెక్ట్‌ ఫైల్స్‌‌ని పరిశీలించనున్నారు. ఇప్పటికే HMDA నుంచి ఫైల్స్‌ ఇవ్వాలని లేఖ కూడా రాశారు. కస్టడీ విచారణలో శివబాలకృష్ణకు చెందిన నాలుగు బ్యాంక్‌ లాకర్లు కూడా ఓపెన్‌ చేయనున్నారు అధికారులు. మరోవైపు శివబాలకృష్ణ అరెస్టుతో ఆయనతో పాటు పనిచేసిన అధికారుల్లో గుబులు మొదలైంది.

Tags:    

Similar News