తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రాణహిత పుష్కరాలు.. ఏప్రిల్ 13 నుంచి 24 వరకు...
Pranahita Pushkaralu 2022: పుష్కరాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని బీజేపీ ఆరోపణలు...
Pranahita Pushkaralu 2022: తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రాణహిత పుష్కరాలు రాబోతున్నాయి. 12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఏప్రిల్ 13 నుంచి 24 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. ఓ వైపు సమయం దగ్గర పడుతున్నా.. కాళేశ్వరంలో పుష్కరఘాట్ వద్ద పనుల్లో పురోగతి కనిపించడం లేదు. తెలంగాణలోనే పుట్టి ఇక్కడే అంతర్లీనమయ్యే జీవనది ప్రాణహిత. గోదావరి నదికి ప్రాణహిత ప్రధాన ఉపనది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడి హెట్టికి పైభాగంలో పెన్ గంగా, వార్దా నదుల కలయికతో ప్రాణహిత నది పుట్టింది. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రయాణం మొదలై కాళేశ్వరం వరకు 113 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ప్రాణహిత కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. అవతలి వైపు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రాణహితనది ఎక్కువగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వరకు ఎంతో ఘనంగా పుష్కరాలను నిర్వహించారు. అయితే నదిలో గడ్డి, పిచ్చిమొక్కలు అపరిశుభ్రత ఉండడంతో నదిలో స్నానం చేయడానికి భయపడుతున్నారు భక్తులు. అయితే పుష్కరాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ విమర్శించారు.
ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి గోదావరిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్వరితగతిన పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.