Hyderabad: హైదరాబాద్ కర్ణంగూడలో కాల్పుల కలకలం
Hyderabad: స్పాట్‌లో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి మృతి
Hyderabad: తెలంగాణలో రియల్ ఎస్టేట్ లో ఆగడాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. రియల్ వ్యాపారంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. భూవివాదాలు ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నాయి. కలిసి మెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పార్ట్‌నర్సే కాల్పులకు తెగబడుతున్నారు.
హైదరాబాద్ కర్ణంగూడలో కాల్పుల ఘటన నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన గొడవ కాల్పులకు దారి తీసింది. సెటిల్ మెంట్‌కు పిలిచి ప్రత్యర్ధులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రియల్టర్ రఘు బీఎన్ రెడ్డి నగర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఇబ్రహీంపట్నం మండలం చర్ల పటేల్ గూడాలో 22 ఎకరాల్లో శ్రీనివాస్ రెడ్డి, రఘు, మట్టారెడ్డి వెంచర్ వేశారు. వెంచర్ విషయంలో మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డి, రఘు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి శ్రీనివాస్ రెడ్డి, రఘు వెళ్లారు. వెంచర్ వద్ద మాట్లాడుతామని మట్టారెడ్డి పిలిచాడు. ఈ క్రమంలో ఉదయం 8గంటలకు కాల్పులు చోటు చేసుకున్నాయి.
మట్టారెడ్డి అనే వ్యక్తిపై శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వెంచర్‌లో తలెత్తిన గొడవలే కాల్పులకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలిలో పోలీసులు విచారణ చేపట్టారు.