Telangana: పంట రుణామాఫీ ఎప్పుడు ?

*రూ.లక్ష లోపు తీసుకున్న అన్నదాతల పడిగాపులు *బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు *అప్పులపాలవుతున్నామని రైతుల ఆవేదన

Update: 2021-10-08 14:15 GMT

రూ.లక్ష లోపు తీసుకున్న అన్నదాతల రుణ మాఫీ కోసం పడిగాపులు(ఫైల్ ఫోటో)

Telangana: రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించిన పంట రుణ మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ పూర్తిగా రుణ విముక్తి జరగక పోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. మాఫీ వర్తిస్తుందనే ధీమాతో ఉన్న రైతులు రెండేళ్లుగా వడ్డీలు చెల్లిస్తూ ఖాతాలను రెన్యువల్ చేసుకున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తుందా? లేదా అనే ఆందోళనలో ఉన్నారు వరంగల్ జిల్లా రైతులు

రుణమాఫీ అమలులో గందరగోళం నెలకొంది. 2018 డిసెంబర్‌లోపు లక్ష లోపు ఉన్న రైతులకు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా వరంగల్ జిల్లాలో లక్ష రూపాయల లోపు పంట రుణాలను తీసుకున్న రైతుల వివరాలు రెండేళ్ల క్రితమే బ్యాంకుల నుండి తెప్పించుకుంది. మొదటి దశలో 30వేలు, రెండో దశలో 50 వేలు, మూడో దశలో లక్ష రూపాయలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు మూడు దశలు లేవు. రుణమాఫీ ముచ్చట్టే లేదని వరంగల్ రైతులు అంటున్నారు.

వ్యవసాయం చేసిన రైతులు పస్తులు ఉంటున్నారు. ప్రభుత్వ సాయం ఏమీ లేదని గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద తీసుకున్న బ్యాంకు రుణాలు ఇప్పటి వరకు మాఫీ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు.

పెట్టుబడి సాయం కింద తీసుకున్న రుణాలను వెంటనే ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసి పంట రుణాలు మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. కష్టాల్లో ఉన్న తమను ఆదుకొని పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే రాష్ట్ర రైతాంగం సంతోషంగా ఉంటారని వరంగల్ జిల్లా రైతులు అంటున్నారు.

Tags:    

Similar News