Corona: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
Corona: కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటోన్న ప్రభుత్వం * వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తాం: ఈటల
Corona: తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే టెస్టుల సంఖ్యను పెంచిన వైద్యారోగ్య శాఖ.. వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది. త్వరలో రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ టార్గెట్‌గా పెట్టుకుంది. చికిత్స కోసం హాస్పిటల్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. వారం రోజుల్లో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1న రాష్ట్రంలో 887 పాజిటివ్ కేసులు రాగా.. ఆ సంఖ్య 7వ తేదీకి 2వేలకు చేరువయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ పేషంట్లకు చికిత్స అందించేందుకు..భవిష్యత్‌లో కేసులు పెరిగితే అందుకు తగిన బెడ్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లను అందుబాటులో ఉంచారు. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు మంత్రి ఈటల.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పెరిగాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల స్పందించారు. లాక్‌డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్న ఆయన కేసులు పెరుగుతున్నా ఎక్కువ మందిలో లక్షణాలు లేవన్నారు. మరణాల రేటు కూడా తక్కువగానే ఉందని తెలిపారు. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే ఫలితం తెలుస్తోందని, పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వెంటనే కరోనా కిట్ ఇస్తున్నట్లు చెప్పారు. రిపోర్టు వెంటనే రావడం వల్ల కాంటాక్టు ట్రేసింగ్ సులభమవుతోందన్నారు. టెస్టులను అవసరమైతే లక్ష వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంత్రి ఈటల. ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టులు, వ్యాక్సినేషన్ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల నుంచి 60 వేల మందికి నిత్యం వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు. ఈ సంఖ్యను లక్షా 50 వేలకు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా చికిత్సను ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపారకోణంలో చూడొద్దని సామాజిక బాధ్యతగా ప్రైవేటు ఆస్పత్రులూ సేవలు అందించాలన్నారు.
ప్రస్తుతానికి కేసులు పెరుగుతున్నా తీవ్రత తక్కువగానే ఉండటం ఉపశమనం కలిగించే విషయమే అయినా మరికొంత కాలం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉండనుందని చెబుతున్నారు వైద్యారోగ్యశాఖ అధికారులు. ప్రజల నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో అందరు తప్పకుండా కోవిడ్ రూల్స్ పాటించాలని సూచించారు. సభలు, సమావేశాలు, ఫంక్షన్స్‌కి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని కోరారు.