Huzurabad: ఉపఎన్నికలో ప్రతీ ఓటు కీలకం.. పోస్టల్ ఓట్లపై..
Huzurabad: రాజకీయంగా హుజూరాబాద్ ఉఫ ఎన్నిక హీట్ పుట్టిస్తోంది.
Huzurabad: రాజకీయంగా హుజూరాబాద్ ఉఫ ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకొని గెలుపే లక్ష్యంగా బరిలో దిగాయి. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొందనే టాక్ వినిపిస్తోంది. ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా సీన్ మారిపోవడంతో హుజూరాబాద్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ సైతం తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. పోస్టల్ ఓట్లపై ఆయా పార్టీలు నజర్ వేస్తున్నాయి. కాగా హుజూరాబాద్‌లో ఇప్పటివరకు దాదాపు 900 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. అయితే ఈ ఓట్లన్నింటిని గంపగుత్తగా దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయ్యేసరికి హుజూరాబాద్ నియోజవర్గంలో 2.36లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
హుజూరాబాద్‌లో మహిళా ఓటర్లు లక్షా 18వేల 716 మంది ఉండగా, పురుష ఓటర్ల సంఖ్య లక్షా 17వేల 552. ఎన్నారై ఓటర్లు 14 మంది, సర్వీస్ ఓటర్లు 147 మంది, ట్రాన్స్‌జెండర్ ఓటర్లలో ఒకరు ఉన్నారు. నియోజకవర్గంలో మండలాల వారీగా ఓటర్ల సంఖ్య చూస్తే హుజూరాబాద్‌లో 61వేల 673 మంది, ఇల్లంతకుంటలో 24వేల 799, జమ్మికుంటలో 59వేల 20, వీణవంకలో 40వేల 99, కమలాపూర్‌లో 51వేల 282 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక హుజూరాబాద్‌లో కులాల వారీగా ఓటర్లను చూస్తే రెడ్డీలు 22వేల 600, మున్నూరు కాపులు 29వేల 100, పద్మశాలిలు 26,530, గౌడ్స్ 24,200 మంది. ముదిరాజ్‌లు 23వేల 200 మంది, యాదవులు 22వేల 150, నాయిబ్రహ్మణులు 3వేల 300, రజకలు 7వేల 600, మాల 11వేల 100 ఉండగా మాదిగలు 35వేల 600మంది ఉన్నారు. ఎస్టీలు 4వేల 220, మైనార్టీలు 5వేల 100, ఇతరులు 12వేల 50 మంది ఉన్నట్లు సమాచారం.