Etela Rajender: ఈటలపై వేటు వేసి పరోక్షంగా ఇతర మంత్రులను హెచ్చరించిన కేసీఆర్
Telangana: ఈటల రాజేందర్ భర్తరఫ్ తర్వాత... మంత్రులు ఆందోళనలో ఉన్నారా...? ఈటల విషయంలో సీఎం కేసీఆర్ మంత్రులకు ఏలాంటి విషయాలను చెప్పారు...?
Telangana: ఈటల రాజేందర్ భర్తరఫ్ తర్వాత... మంత్రులు ఆందోళనలో ఉన్నారా...? ఈటల విషయంలో సీఎం కేసీఆర్ మంత్రులకు ఏలాంటి విషయాలను చెప్పారు...? ఈటలపై తాజాగా చర్చించిన అంశాలు ఏంటి...? ముఖ్యమంత్రి మానిటరింగ్‌తో మంత్రులు భయ పడుతున్నారా..?
తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. మంత్రి పదవి నుండి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత మొదటిసారి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ప్రధానాంశం కాగా మరికొన్ని ఇతర కీలక అంశాలపై కూడా సీఎం కేసీఆర్ చర్చించారు. ఈటల రాజేందర్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలను మంత్రులకు సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. భూముల వ్యవహారంతో పాటు పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కూడా కేసీఆర్ ప్రస్తావించారు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో ఈటల విషయంలో చర్యలు తప్పలేదని సీఎం అన్నట్టుగా వినికిడి.
ఈటల రాజేందర్ భూకబ్జాలతో మంత్రిత్వశాఖను కోల్పోవడం టీఆర్ఎస్ పార్టీలోని అన్ని వర్గాల్లో ఆందోళన నెలకొంది. సౌమ్యుడిగా, పార్టీ పట్ల లాయల్టీ ఉన్న వ్యక్తిగా ఈటలకు పేరు ఉన్నప్పటికీ 1, 2 వ్యవహారాలు, భూకబ్జాల అంశం ఏకంగా మంత్రి పదవి పోవడానికి కారణం అయిందనే వాస్తవాలు మంత్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకరిద్దరు మంత్రులు ఇలాంటి భూకబ్జా, ఇతర ఆరోపణలు ఎదుర్కోవడం విషయాలు సీఎం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాకుండా మంత్రులకు సంబంధించిన అంతర్గత విషయాలు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం కేసీఆర్‌కు చేర వేసినట్లు సమాచారం. ప్రజలకు మంచి చెడు చెప్పాల్సిన మంత్రులే తప్పుడు బాట పడితే శిక్ష ఖాయం అనే విధంగా ఈటలపై వేటు వేసి సీఎం కేసీఆర్ పరోక్షంగా ఇతరులకు హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమంది పార్టీలో నాయకులు, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే భావనను కూడా సీఎం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈటల రాజేందర్‌పై వేటు పడటంతో పాటు ఇతర మంత్రులపై కూడా ఇంటెలిజెన్స్ మానిటరింగ్ చేస్తుండటంతో కొందరు మంత్రులు ఆందోళనలో ఉన్న పరిస్థితి కనబడుతోంది.