మంత్రి జగదీష్‌రెడ్డికి ఈసీ షాక్.. జగదీష్‌రెడ్డిపై 48 గంటల పాటు కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం
*25వ తేదీ ప్రచారంలో మంత్రి నిబంధనలు ఉల్లంఘించారన్న ఈసీ
Jagadish Reddy: మునుగోడు ఉపఎన్నికకు అధికార పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ప్రచారంలో భాగంగా మంగళవారం మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని సెంట్రల్ ఈసీ నిర్ధారించింది. ఈ ఎన్నిక రాజగోపాల్ కు, ప్రభాకర్ రెడ్డికి మధ్య జరుగుతున్నది కాదని.. 2 వేల పెన్షన్ కావాలనుకునేవారికి, వద్దనుకునేవారికి.. అలాగే రైతుబంధు కావాలనుకునేవారికి, వద్దనుకునేవారికి జరుగుతోందన్నారు.
వికలాంగులకు పింఛన్ కొనసాగాలా వద్దా అనేవారి మధ్య జరుగుతోందన్నారు. పెన్షన్లు కావాలనుకునేవారు కారు గుర్తుకు ఓటేయాలని, అక్కరలేనివారు మోడీకి ఓటేయాలన్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఈసీ.. ప్రచార ఫుటేజీని పరిశీలించి మంత్రికి నోటీసులిచ్చింది. అయితే జగదీశ్ రెడ్డి స్పందనకు, ఆయన చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకపోవడంతో అసంతృప్తి చెందిన ఈసీ 31వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు ఆయన ఎక్కడా ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశించింది. సభలు, సమావేశాలు, పబ్లిక్ ర్యాలీల్లో పాల్గొనరాదని, ఇంటర్వ్యూలు ఇవ్వరాదని పేర్కొంది.