హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం
Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరుచోట్ల సోదాలు చేసిన ఈడీ
Hyderabad: హైదరాబాద్‌లో వరుసగా ఈడీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరుచోట్ల సోదాలు చేసిన ఈడీ.. హార్డ్‌డిస్క్‌లు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈడీ కార్యాలయంలో బిల్డర్ శ్రీనివాస్‌రావును సుధీర్ఘంగా విచారించిన ఈడీ.. కీలక సమాచారం సేకరించింది. లిక్కర్ స్కాం ముడుపుల వ్యవహారంలో ప్రశ్నించింది. బినామీ, బిజినెస్ పాట్‌నర్స్‌పై ఆరా తీసింది. ఈడీ అధికారుల విచారణలో ఐటీ అధికారులు రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతుంది ఈడీ. హైదరాబాద్‌లో మూడు దఫాలుగా సోదాలు నిర్వహించి, కీలక సమాచారం రాబట్టిన ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. రాబిన్ డిస్టలరీస్‌తో మొదలైన విచారణ.. పలువురు వ్యక్తులకు, కంపెనీలకు విస్తరించింది. హైదరాబాద్‌లో దాదాపు 20 మందిపై సోదాలు జరిపి, వారి కంపెనీలు, వారి భాగస్వాములను ప్రశ్నించింది. రామచంద్రన్ పిళ్లై సహా.. ప్రేమ్‌సాగర్‌రావు, అభిషేక్ రావు, అభినయ్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శ్రీధర్, తాజాగా శ్రీనివాస్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది ఈడీ. కంపెనీలకు సంబంధించి సీఏ గోరంట్ల అసోసియేట్, అనూస్, జోనా, సాలిగ్రాం, పలు కంపెనీలు, వాటి అనుబంధ కంపెనీల డైరెక్టర్ల ఇళ్లల్లో సైతం సోదాలు చేసింది. సేకరించిన సమాచారం క్రోడీకరించి నోటీసులు పంపి విచారణ ప్రారంభించింది ఈడీ.
గత ఆదివారం రాబిన్ డిస్టలరీస్ యజమాని రామచంద్రన్ పిళ్లైని 8 గంటలు విచారించారు ఈడీ అధికారులు. కీలక ఆధారాలు సేకరించి మరోసారి ఆరుచోట్ల సోదాలు జరిపారు. సుచిత్రా, కొండాపూర్‌లో నివాసాలు, బంజారాహిల్స్‌లో శ్రీనివాస్‌రావు, జోనా టెక్నాలజీస్, మాదాపూర్ వార్సన్ సాఫ్ట్‌వేర్, ఉప్పల్ సాలిగ్రాం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సోదాలు జరిపింది ఈడీ. అనంతరం హార్డ్‌డిస్క్‌లు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. బంజారాహిల్స్‌లో వెన్నమనేని శ్రీనివాస్‌రావును అదుపులోకి తీసుకున్న అధికారులు.. అతడిని ఈడీ కార్యాలయానికి తరలించి 6 గంటలు విచారించారు. శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో మరికొంతమందిని విచారించనున్నారు. సీఏ గోరంట్ల బుచ్చి బాబు కార్యాలయంలో దొరికిన సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. అలాగే.. ఫ్లయిట్ టికెట్స్ బుకింగ్ నుంచి మనీ లాండరింగ్ నగదు బదిలీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇక.. ఈడీ అధికారుల సోదాల్లో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు రెండు వందల కోట్లు ఇచ్చినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. అయితే.. ఈ రెండు వందల కోట్లు శ్రీనివాస్‌రావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఈ అంశంపై శ్రీనివాస్‌రావును అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా..? లేక మరో దానికా..? అనే కోణంలో ఈడీ దర్యాప్తు జరిపింది. ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో కీలక ఆధారాలు సేకరించిన ఈడీ.. పలువురిపై సోదాలు చేపట్టింది. టెండర్ల నుంచి లైసెన్స్ వరకు రెండు వందల కోట్లు హైదరాబాద్ నుంచి వెళ్లినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 18 జోన్లకు సంబంధించి 9 లిక్కర్ కంపెనీలకు హైదరాబాద్ వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నట్టు గుర్తించిన ఈడీ.. రెండు వందల కోట్ల డబ్బు ఎవరి ఖాతా నుంచి వెళ్లిందనే కోణంలో లోతుగా విచారణ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీతో పాటు ఐటీ శాఖ సైతం రంగంలోకి దిగింది. వివిధ కంపెనీల నుంచి పెద్దఎత్తున డబ్బులు బదిలీ అయిన నేపథ్యంలో.. ఆ కంపెనీలకు సంబంధించిన వివరాలపై ఒకవైపు ఈడీ.. మరో వైపు ఐటీ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు సేకరించిన ఆధారాలను ఐటీ అధికారులు పరిశీలించారు. దీంతో.. లిక్కర్ స్కా్మ్‌లో హైదరాబాద్‌లో ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.