హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుమీద ఎంతో సుందరంగా నిర్మిస్తున్న తీగలవంతెన పూర్తయ్యే దశకు చేరుకుంది. కాగా ఈ వంతెనను జూన్ చివరి నాటికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న వంతెనను ప్రారంభించిన అనంతరం వంతెనపై సోమవారం నుంచి శుక్రవారం వరకు ట్రాఫిక్ ను అనుమతించనున్నారు. రూ .184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన ద్వారా మైండ్ స్పేస్ నుండి జూబ్లీ హిల్స్ వరకు ప్రయాణించే ప్రయాణికులకు రెండు కిలో మీటర్ల మేరకు దూరం తగ్గినుంది. ఇక ఈ వంతెనను ప్రారంభించిన అనంతరం శనివారం, ఆదివారం ట్రాఫిక్‌ను అనుమతించబోమని, వాహనదారుల తమ వాహనాలను కేటాయించిన స్థలంలో పార్క్ చేసి వంతెనపై నడిచి సరస్సు సుందరమైన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చని జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీధర్ అన్నారు.
ప్రస్తుతం వంతెన సైడ్ రైలింగ్, ఆర్కిటెక్చరల్ మెరుగుల వ్యవస్థాపన వంటి పనులు జరుగుతున్నాయని, అవి వచ్చే నెల చివరి నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెం.45 నుంచి కేబుల్ వంతెనకు గల మార్గాన్ని జూలై చివరి నాటికి తెరవబడుతుందని తెలిపారు. ఇక కేబుల్ వంతెనపైనుంచి దుర్గం చెరువు అందాలను చూడాలనుకునే వారికి రాత్రి సమయాల్లో మల్టీ-కలర్ థీమ్ లైటింగ్ కనువిందు చేస్తుంది.