Sahiti Infratec: జనం దగ్గర వందల కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్‌ఫ్రా.. నిధుల దుర్వినియోగంపై లెక్కలు తీస్తున్న ఈడీ
ED allegations on sahiti infratec: సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIVIPL) సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థల్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగం పెంచింది. ఇళ్ల కొనుగోలుదారుల వద్ద సేకరించిన డబ్బును దుర్వినియోగం చేశారని ఈడి ఆరోపిస్తోంది. ఇంటి కొనుగోలుదారులు చెల్లించిన మొత్తం, అలాగే వారికి లోన్స్ రూపంలో బ్యాంకులు మంజూరు చేసిన రుణాలపై లెక్కలు ఆరా తీస్తోంది. ఆ డబ్బులు ఏమయ్యాయి, ఎన్ని బ్యాంకు ఎకౌంట్లలోకి బదిలీ అయ్యాయి అనే కోణంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అన్ని వివరాలు సేకరించి పీఎంఎల్ఏ కోర్టులో (PMLA) అప్పగించినట్లు తెలుస్తోంది.
సాహితి ఇన్‌ఫ్రాటెక్ సంస్థ యజమాని బూదాటి లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఖాతాల్లోకే ఇళ్ల కొనుగోలుదారుల డబ్బులు బదిలీ అయినట్లు ఈడీ చెబుతోంది. ఇప్పటికే సాహితి ఇన్‌ఫ్రాటెక్ వ్యవహారంలో వివిధ పోలీసు స్టేషన్లలో 56 కేసులు నమోదయ్యాయి. ఇళ్ల కొనుగోలుదారులను మోసం చేసే ఉద్దేశంతో అనేక లావాదేవీలు జరిగినట్లు ఈడి తమ నివేదికలో పేర్కొంది. అంతేకాదు... సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రికార్డ్స్ లో రూ. 216 కోట్లు ఎంట్రీనే చేయలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.
ఇలా నిధుల గోల్‌మాల్ జరిగిందంటున్న ఈడీ
భారీ మొత్తంలో డబ్బులు నగదు రూపంలో విత్‌డ్రా చేసి సొంత ఖర్చులు వాడుకోవడం, ఆస్తులు కొనుగోలు చేయడం, కొత్త కొత్త ప్రాజెక్టులకు ఆ డబ్బులు వాడటం వంటివి చేశారని ఈడి తెలిపింది. ఈ లావాదేవీల వల్ల సంస్థ యజమాని బూదాటి లక్ష్మీనారాయణ (Boodati Lakshmi Narayana), ఆయన కుటుంబసభ్యులే లాభపడ్డారని ఈడి వెల్లడించింది.
ఇదేకాకుండా అదనంగా మరో రూ.12.48 కోట్లు ఎస్‌బిఎల్ డ్రీమ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SBL Dream Homes Pvt limited) బదిలీ చేశారు. అందులోంచి రూ. 8.43 కోట్లు సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ నిర్మాణంతో సంబంధమే లేని ఇతరత్రా అవసరాలకు వెచ్చించారని ఈడీ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈ డబ్బంతా ఇళ్ల కొనుగోలుదారుల వద్ద అడ్వాన్సుల రూపంలో వసూలు చేసి అసలు పనితో సంబంధం లేకుండా ఇతర అవసరాలకు ఆ డబ్బును దుర్వినియోగం చేశారనేది ఈడీ చేస్తోన్న ఆరోపణ.