Formula E Race: కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం సిద్దం..?
Formula E Race: కేటీఆర్ ను ఫార్మూలా -ఈ కార్ రేస్ కేసులో విచారించేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) అనుమతించారు.
Formula E Race: కేటీఆర్ ను ఫార్మూలా -ఈ కార్ రేస్ కేసులో విచారించేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) అనుమతించారు. గవర్నర్ అనుమతికి సంబంధించిన పత్రాలను ఏసీబీకి పంపాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 16న జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు. గవర్నన్ నుంచి అనుమతి పత్రాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.
ఫార్మూలా -ఈ కార్ రేసు విషయంలో అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల విదేశీ కరెన్సీ చెల్లించారు. దీనిపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది.దీనిపై అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లను బాధ్యులుగా మున్సిపల్ శాఖ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
అసలు కేసు ఏంటి?
ఫార్మూలా-ఈ కార్ రేసు విషయంలో ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఒప్పందం చేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్ బీ ఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం కూడా ఉల్లంఘనగా చెబుతున్నారు. ఫార్మూలా-ఈ కార్ రేసుకు తొలుత ఒప్పందం చేసుకున్న సంస్థ కోర్టుకు వెళ్లింది. ఆ తర్వాత కోర్టులో కేసు ఉపసంహరించుకుంది. అప్పటి పురపాలక శాఖ మంత్రి సూచన మేరకు డబ్బులు చెల్లించినట్టు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరణ ఇచ్చారు. ఈ విషయమై గతంలోనే కేటీఆర్(KTR) స్పందించారు. హైదరాబాద్ పేరును ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసేందుకు ఫార్మూలా-ఈ కార్ రేసు కోసం నిధులు విడుదల చేయాలని చెప్పానని ప్రకటించిన విషయం తెలిసిందే.