Dubai Hospital Waives Rs 1.5 Crore Bill: కరోనా చికిత్సకు 80 రోజుల్లో..రూ.1.5 కోట్ల బిల్లు.. మాఫీ చేసిన హాస్పిటల్
Dubai Hospital Waives Rs 1.5 Crore Bill: పొట్ట కూటి కోసం దుబాయ్ వెళ్లిన ఓ తెలంగాణ వాసి అక్కడే కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను 80 రోజులపాటు ఆస్పత్రికే పరిమితమై వైద్యం తీసుకున్నాడు.
Dubai Hospital Waives Rs 1.5 Crore Bill: పొట్ట కూటి కోసం దుబాయ్ వెళ్లిన ఓ తెలంగాణ వాసి అక్కడే కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను 80 రోజులపాటు ఆస్పత్రికే పరిమితమై వైద్యం తీసుకున్నాడు. ఆ 80 రోజుల పాటు తీసుకున్న వైద్యానికి ఆస్పత్రి బిల్లు 7,62,555 దిర్హమ్‌లు అయ్యింది. అంటే మన ఇండియన్ కరెన్సీగా చూసుకుంటే రూ.1.52 కోట్లు అయ్యింది. అయితే అతను ఉన్న పరిస్థితుల్లో అంత మొత్తం ఆస్పత్రి బిల్లు చెల్లించడం సాధ్యపడకపోవడంతో హాస్పిటల్ యాజమాన్యం మానవతా దృక్పథంతో బిల్లు మొత్తాన్ని మాఫీ చేసింది. అంతేకాదు అతను క్షేమంగా హైదరాబాద్ రావడానికి తన వంతు సాయం కూడా అందించింది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన రాజేష్ (42) దుబాయ్ కి వలస వెల్లాడు. లాక్ డౌన్ కారణంగా విమానాలు బంద్ కావడంతో అతను తిరిగి ఇక్కడి రావడం కుదరలేదు. దీంతో అతను అక్కడే ఉండాల్సివచ్చింది. ఈ క్రమంలోనే అతను కరోనా బారిన పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్‌లోని గల్ఫ్ కార్మికుల రక్షణ సంఘం అధ్యక్షుడు నరసింహ అతన్ని దుబాయ్‌లోని అల్ ఖలీజా రోడ్‌లో ఉన్న హాస్పిటల్‌లో ఏప్రిల్ 2న చేర్పించారు. ఆ తరువాత అతను 80 రోజులపాటు వైద్యం తీసుకుంటూ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. కాగా అతని బాగోగుల విషయమై నరసింహ రోజూ హాస్పిటల్‌కు వెళ్లి ఆరా తీసేవారు.
ఇదిలా ఉంటే నరసింహ దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వాలంటరీ సుమంత్ రెడ్డి దృష్టికి జగిత్యాల వాసి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం గురించి సమాచారం ఇచ్చారు. ఆ తరువాత వెంటనే వీరంతా కలిసి దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ (లేబర్)లో పని చేస్తున్న రాయబారి హర్జిత్ సింగ్‌కు అతడి పరిస్థితిని వివరించారు. సమాచారం అందుకున్న హర్జిత్ వెంటనే స్పందించారు. హాస్పిటల్ యాజమన్యానికి లేఖ రాశారు. దీంతో బాధితునికి వైద్యం అందించిన ఆస్పత్రి యాజమాన్యం సానుకూలంగా స్పందించి బిల్లు మొత్తాన్ని మాఫీ చేసింది. అంతే కాకుండా బాధితుడు హైదరాబాద్ రావడానికి సాయం కూడా చేసింది.
బాధితుడు కరోనా నుంచి కోలుకుని ఇండియా రావడానికి అశోక్ ఉచితంగా ఫ్లయిట్ టికెట్లు ఇవ్వడంతోపాటు అతనికి తోడుగా మరో వ్యక్తిని కూడా ఇండియాకి పంపించారు. అంతే కాక అత్యవసర ఖర్చుల కోసం రూ.10 వేలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం అతడు 14 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉంటున్నాడు.