డేంజర్ బెల్స్ మోగిస్తున్న రోడ్డు ప్రమాదాలు.. ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవ్ కారణంగా నలుగురు మృతి
Hyderabad: మూడు కమిషనరేట్ల పరిధిలో పెరుగుతున్న డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు...
Hyderabad: హైదరాబాద్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, మద్యం మత్తు, రేసింగ్ పిచ్చి, ఎదుటి వారి నిర్లక్క్ష్యం.. కారణం ఏదైతేనేమి ఘోర రోడ్డు ప్రమాదాలు చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. కళ్లముందే తమ పిల్లలు తిరిగి రాని లోకాలకు తరలిపోతోంటే కన్నవారి గుండెలవిసిపోతున్నాయి. ఆ మానసిక క్షోభ జీవితాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది.
ఇటీవల హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవ్ కారణంగా నలుగురు మృత్యువాతపడ్డారు. ట్రాఫిక్ పోలీసుల నిఘా లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కెమెరాతో చలాన్లకే పరిమితం అవుతున్నారని విమర్శిస్తున్నారు.
హైదరాబాద్ పోలిస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 242 మంది మృతి చెందారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2020లో 189 మంది మరణించారు. సైబరాబాద్ పరిధిలో 32వేల 828 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా 210 ప్రమాదాలు జరిగాయి.
మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తాగి వాహనం నడిపిన వారి కారణంగా గతేడాది తెలంగాణలో 343 మంది మృత్యువాతపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు ఎక్కువగా VIP జోన్‌లోనే జరుగుతున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఓ అర్ అర్, నగర శివార్లతో పాటు సిటీ సెంటర్లో సంభవిస్తున్నాయి.
గడిచిన ఆరు నెలల్లో 200 కోట్లకు పైగా చలానాలు విధించారు. సిటీలో మొత్తం 340 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. అయితే కాప్ లెస్ విధానానికే పోలీసులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో నిత్యం రోడ్లపై 50 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతుంటాయి. అయితే ట్రాఫిక్ పోలీసుల విషయానికి వస్తే.. 5వేలకు మించి లేరు. ఇదీ ఓ సమస్యగా మారింది.
ఇక పోలీసులు లేని ప్రాంతాల్లో ఇష్టానుసారంగా విన్యాసాలకు పాల్పడుతున్నారు పోకిరీలు. పలు చోట్ల పోలీసులు ఉన్నా కొంతమంది యవకులు రెచ్చిపోతున్నారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రులు మద్యం తాగి ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు మందుబాబులు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ట్రాఫిక్ పోలీసుల నిఘా కరువైందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. మితిమీరిన వేగం, మందుబాబుల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.