Hyderabad: ఎంజీ బస్‌స్టేషన్‌లో ‘డిజిటల్ పార్కింగ్’.. ఇకపై అలా చేస్తే కష్టమే..
Hyderabad: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన ఎంజీ బస్‌స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ‘డిజిటల్ పార్కింగ్’ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
Hyderabad: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన ఎంజీ బస్‌స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ‘డిజిటల్ పార్కింగ్’ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ విధానాన్ని తొలిసారిగా ఎంజీబీఎస్‌లో ప్రవేశపెట్టింది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే వచ్చిన సమయం, వెళ్లే సమయం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవుతోంది. పార్క్ చేసిన సమయాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ఎంజీబీఎస్‌లోని ఖాళీ స్థలంలో బైక్‌లకు నాలుగు చోట్ల, కార్ పార్కింగ్‌కు ఒక చోట స్థలం కేటాయించారు. డిజిటల్ పార్కింగ్ వ్యవస్థ దేశంలోని వివిధ విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో అమలులో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ‘పార్క్‌మేట్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆర్టీసీకి 92శాతం, సదరు సంస్థకు 8శాతం ఆదాయం సమకూరుతోంది. గతంలో గుత్తేదారులు ఆర్టీసీకి అద్దెలు చెల్లించేవారు. ప్రస్తుతం పార్క్‌మేట్ సంస్థ సిబ్బంది ఇక్కడ పని చేస్తున్నారు.
డిజిటల్ పార్కింగ్ వ్యవస్థ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన బస్‌స్టేషన్లలోనూ విస్తరించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో పార్కింగ్ నిర్వాహకులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తరచూ ఫిర్యాదులు అందేవి. ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది స్వీయ పర్యవేక్షణలో పార్కింగ్ కొనసాగుతుండడంతో వాహనదారులకు సమస్యలు తలెత్తితే తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.