Demolition of Telangana secretariat: క్షణాల్లో సెక్రటేరియట్ కూల్చివేతకు రంగం సిద్ధం!
Demolition of Telangana secretariat: తెలంగాణలో నూతన సచివాలయ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో పాత సెక్రటెరియట్ కూల్చివేత అతి త్వరలో చేపట్టనుంది. సెక్రటేరియట్ భవనాలను బిల్డింగ్ ఇంప్లోజన్ విధానంలో కూల్చి వేయాలని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ పాత సచివాలయం కూల్చివేతకు అవసరమైన చర్యలను అధికారులు చేపడుతున్నారు. తర్వలో పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమైయ్యారు. బిల్డింగ్ ఇంప్లోజన్ అనే ఆధునిక సాంకేతిక పద్ధతిలో ఈ సెక్రటేరియట్ భవనాలను కూల్చివేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ విధానం అత్యంత ఖర్చుతో కూడుకున్న విధానం. ఈ విధానంలో భారీ భవనాలను నిమిషల్లోనే భవనాలు నేలమట్టం చేయవచ్చు. సచివాలయ ప్రాంగణంలో 11 బ్లాక్స్ ఉన్నాయి. వీటిని ఇంప్లోజన్ విధానంలో కూల్చివేయడానికి అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుత సచివాలయంలో మొత్తం 11 బ్లాకులు ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయమైన సమతాబ్లాక్ 6 ఫ్లోర్ తో ఉంది. ఇటీవల తెలంగాణకు అప్పగించిన ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ భవనం 'ఎల్' బ్లాక్, పక్కనే ఉన్న జె బ్లాక్ 8 అంతస్తుల ఎత్తులో ఉన్నాయి. నార్త్, సౌత్ 'హెచ్' బ్లాకులు మూడంతస్తులు, తెలంగాణ మంత్రుల కార్యాలయాల భవన సముదాయం డీ బ్లాక్ మూడంతస్తుల్లో ఉంది. పోస్టాఫీసు, బ్యాంకులున్న 'కే' బ్లాక్ కేవలం రెండంతస్తుల్లోనే ఉంది. వీటన్నింటినీ ఏకకాలంలోనే కూల్చివేయాలని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి నేతృత్వంలోని సాంకేతిక నిపుణుల కమిటీ నిర్ణయించింది.
ఇంప్లోజన్ విధానంలో ఉపయోగించేవి పేలుడు పదార్థాలే అయినప్పటికీ తక్కువ శబ్దంతోకూల్చివేసేందుకు అవకాశం ఉంది. ఒక్కో భవనంలో మూడు నుంచి ఐదు దశల్లో జిలెటిన్‌స్టిక్స్‌ను అన్ని పిల్లర్లకు అమర్చి సచివాలయం బయట నుంచి రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా పేల్చనున్నారు. అంతకు ముందే సచివాలయంలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని పరిశీలించి అన్ని కోణాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నారు.
సచివాలయంలో ఉన్న భవనాలు భారీ పిల్లర్లతో బహుళ అంతస్తులు కలిగి ఉన్నందున వాటి కూల్చివేతకు ఎక్కువ సామర్థ్యంతో కూడిన జిలెటిన్‌స్టిక్స్‌ను అమర్చనున్నారు. జర్మన్ దేశ సాంకేతిక విధానాన్ని ఇందులో అనుసరించనున్నారు. ముందుగా భవన నిర్మాణ ప్రణాళికను అధ్యయనం చేసి కీలకమైన పిల్లర్లను గుర్తిస్తారు. వాటి ఎత్తు, విస్తీర్ణం ఆధారంగా జిలెటిన్‌స్టిక్స్‌ను అమర్చి ఉంచనున్నారు. ఇలా సచివాలయంలోని 11 బ్లాకులకు కూడా అమర్చిన తర్వాత ఎక్కడా సాంకేతిక లోపాలు లేకుండా చూసుకుని సచివాలయం వెలుపల నుంచి ఆపరేషన్ నిర్వహించనున్నారు. ఈ విధానంతో కూల్చివేతలకు కేవలం నిమిషాల సమయమే అవసరమైనప్పటికీ అన్ని కోణాల్లో ముందు జాగ్రత్త చర్యలు నిఘాను ఏర్పర్చడానికి ఎక్కువ సమయం అవసరమవుతోంది.
కూల్చివేతకే సుమారు 10 కోట్ల నుంచి 15 కోట్లు అవసరమవుతాయని ఆర్‌అండ్‌బీ అధికారులు అంచనా వేశారు. ఇక కూల్చిన శకలాల్లో ఇనుప చువ్వలను వేరుచేసి మట్టి, కాంక్రీట్‌ను నగరం వెలుపలకు తరలించేందుకు 50కోట్ల వ్యయం దాటుతుందని నిపుణులు చెబుతున్నారు. కూల్చివేతల ప్రక్రియను ఒక సంస్థకు అప్పగించనున్నారు. జూలై నెలాఖరు వరకు కూల్చివేత, శకలాల ఎత్తివేత ప్రక్రియ పూర్తయితే సెప్టెంబర్ లో అండర్‌గ్రౌండ్ పార్కింగ్ కోసం పనులు ప్రారంభం అయ్యా అవకాశాలు ఉన్నాయి.