Hyderabad: లాక్‌డౌన్‌తో గణనీయంగా తగ్గిన వాయు కాలుష్యం
Hyderabad: లాక్‌డౌన్ వాతావరణానికి చాలా మేలు చేసింది. ముఖ్యంగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది
Hyderabad: లాక్‌డౌన్ వాతావరణానికి చాలా మేలు చేసింది. ముఖ్యంగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. మునుపెన్నడూ లేనివిధంగా నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. శ్వాసకోశ ఇబ్బందులతో సతమతం అయ్యే వారికి స్వచ్ఛమైన వాయువు దోహదపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
తెలంగాణలో కొనసాగుతోన్న లాక్ డౌన్ వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గింది. పలు నగరాలు గ్రీన్ జోన్ లోకి వచ్చాయి. గతేడాది లాక్ డౌన్ ఎత్తేశాక పెరిగిన కాలుష్యం... ఇప్పుడు మళ్లీ కాలుష్యం తగ్గడంతో ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతున్నారు. మే మొదటి వారంతో పోల్చితే రెండో వారంలో కాలుష్యం మరో 20శాతం తగ్గింది. లాక్‌డౌన్ పటిష్ట అమలుతో వాహనదారులు బయటకు రాకపోవడంతోనే నగరంలో వాయుకాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గిందని పీసీబీ అధికారులు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గింది. పాశమైలారం, బొల్లారం ప్రాంతంలో కూడా కాలుష్య తీవ్రత సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదు కావడం విశేషం. అయితే మహానగరంలో నిత్యం వాహన రాకపోకలు ఉండటం వల్ల వాయు కాలుష్యంతో శబ్ద కాలుష్యం కూడా అత్యధికంగా ఉండేది. లాక్ డౌన్‌తో గాలిలో నాణ్యత పెరగడంతో, శ్వాసకోశ ఇబ్బందులతో సతమతం అయ్యేవారు హాయిగా ఊపిరిపీల్చుకోగలుగుతున్నారు. మొత్తంగా లాక్ డౌన్‌తో ఇటు కరోనా కట్టడితో పాటు కాలుష్యాన్ని నివారించి ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.