Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వేసవిని తలపిస్తున్న పగటి ఉష్ణోగ్రతలు
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా ఎండ తీవ్రత అకస్మాత్తుగా పెరిగిపోయింది. దీంతో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కారణంగా వాతావరణం వేసవిని తలపిస్తోంది.
ఇక ఉదయం నుంచే భానుడు భగభగా మండిపోతుండడంతో ఎండ వేడిమి, ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అప్‌డేట్ వెలువరించింది. నైరుతి రుతుపవనాలు తరలిపోనున్నాయని, దాని కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని ఐఎండీ సూచించింది. అంటే తీవ్రమైన ఉక్కపోత, వేడి మరి కొద్దిరోజులు తప్పేట్లు లేదని తెలుస్తోంది.
గత కొద్దిరోజుల్నించి తీవ్రమైన ఉక్కపోత, వేడితో పాటు కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది. అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై కన్పించినా వర్షాల జాడ మాత్రం లేదు. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు వెనక్కి తరలిపోతుండటమేనని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలి వేగం కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల మేఘాల కదలిక పెద్దగా ఉండదని తెలిపింది. ఇక వర్షాలు దాదాపుగా ముగిసిపోయినట్టేనని వాతావరణశాఖ తెలిపింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ నెలంతా వర్షాలుండకపోవచ్చని వాతావరణశాఖ తెలిపింది. అదే సమయంలో తీవ్ర ఉక్కపోత, వేడి కూడా ప్రజలను బాధించే అవకాశం ఉంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు వచ్చే అవకాశమున్నందున ఆ ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలుండవచ్చు తప్ప.. ఇతర పరిస్థితులతో మాత్రం వర్షాలు లేనట్టేనని వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనంలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ గానే ఉండే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో వర్షాలు కూడా మధ్యలో కురుస్తూ కొంత ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత క్రమేపీ శీతాకాల వాతావరణం వస్తుందని వాతావరణశాఖ తెలిపింది.