మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా సీవీ ఆనంద్...

CV Anand: ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్‌లు...

Update: 2022-05-27 03:00 GMT

మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా సీవీ ఆనంద్...

CV Anand: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మూడు కమిషనరేట్లకు కమిషనర్ గా కొనసాగుతున్నారు. సైబరాబాద్ ,రాచకొండ కమిషనర్లు స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్ లు లీవ్ లో వెళ్లడంతో ఆ కమిషనరేట్ల అదనపు బాధ్యతలను సీవీ ఆనంద్ చూస్తున్నారు. అలా ఒకేసారి మూడు కమిషనరేట్ల బాధ్యతలు చూస్తున్న మొదటి కమిలషనర్ గా సీవీ ఆనంద్ సిటీ పోలీస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.

హైదరాబాద్‌ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ప్రస్తుతం రాజధానిలోని మూడు కమిషనరేట్‌లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్‌ రవీంద్ర, మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ సెలవులో ఉండటమే ఇందుకు కారణం. దీంతో రెండు కమిషనరేట్లకూ ఆయనే ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్నారు. ఇలాంటి ఘట్టం ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి. ఈ నెల రెండో వారంలో రాచకొండ కమిషనర్‌ మహేష్ భగవత్ సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఆ కమిషనరేట్‌కు సైబరాబాద్‌ సీపీని ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అయితే గత వారం సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర సైతం సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఈ పోస్టుకు ఆనంద్‌కు ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ను చేశారు. దీంతో సాంకేతికంగా ఆయనే రెండు కమిషనరేట్లను ఇన్‌చార్జ్‌ సీపీగా మారారు. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పరిపాలన వ్యవహారాలను ఆనంద్‌ అదనపు పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ఆయా కమిషనరేట్ల కమిషనర్లు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులు, పరిణామాలు, కార్యక్రమాలు, నిరసనలపై టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుంటారు.

వీటికి సంబంధించి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు రూపొందించే నివేదిక పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్‌లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్‌ ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్ లను నిర్వహించడంతో పాటు మూడు నివేదికలు పరిశీలిస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కు సంబంధించిన వ్యవహారాలు ఆయనే పర్యవేక్షించారు

సైబరాబాద్ కు గతంలో కమిషనర్ గా పని చేసిన సీవీ ఆనంద్ మళ్లీ ఇప్పుడు ఇన్ ఛార్జ్ సీపీ గా దేశ ప్రధాని పర్యటన సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించటం విశేషం. ఇక ఒకప్పుడు హైదరాబాద్ మొత్తం ఒకే కమిషనరేట్ పరిధిలో ఉండగా సిటీలో ఐటీ విస్తరణ తరువాత సైబరాబాద్ కమిషనరేట్ 2003 లో ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2016 లో రాచకొండ కమిషనరేట్ ఏర్పడింది.

Tags:    

Similar News