వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే తెలంగాన ప్రభుత్వం వరద సహాయ చర్యలను చేపట్టింది. అయితే ఈ వరద సహాయచర్యలు త్వరగా పూర్తయ్యేందుకు మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ శ్వేతా మహంతి, ఇతర అధికారులు కీలక పాత్ర పోషించారు. కాగా వారందరికీ సీఎస్ సోమేశ్ కుమార్ అభినందనలు తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా 80 వేల కుటుంబాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్థిక సాయం అందించారు. ఇప్పటి వరకు రూ. 120 కోట్ల మేర ఆర్థిక సాయం చేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కో ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ప్రజా సంక్షేమం కోరే వారికి అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని సీఎస్ పేర్కొన్నారు. ఈ విజయదశమి వేళ రాష్ర్ట ప్రజలకు అంతా శుభమే జరగాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు.
ఇక పోతే ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నగరంలో కురుసిన వర్షాలకు, భారీ వరదలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. కాగా అక్కడి ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. వరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అదే విధంగా నగరంలోని పేదప్రజలకు ఆర్థిక సాయం అందించేందుకు మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణం విడుదల చేసారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.