Crematoriums Set Up in Hyderabad: 75 నిమిషాల్లో దహనం.. హైదరాబాద్లో 4 దహన వాటికలు ఏర్పాటు
Crematoriums Set Up in Hyderabad: కోవిద్ మరణాలకు సరైన పరిష్కారం తెలంగాణా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Crematoriums Set Up in Hyderabad: కోవిద్ మరణాలకు సరైన పరిష్కారం తెలంగాణా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరణాలు ఎక్కువగా ఉండటం, వాటికి సంబంధించి సరైన పరిష్కారం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా గ్యాస్ దహన వాటికలను ఏర్పాటు చేసింది. నగరంలో ప్రస్తుతం నాలుగింటిని ఏర్పాటు చేయగా, మరిన్నింటిని విస్తరించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది.
కోవిడ్–19 మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే 650కిపైగా మరణాలు నమోదయ్యాయి. కోవిడ్‌తో వ్యాధి తీవ్రమైన వారు ఎక్కువ మంది నగరానికే వస్తుండటం.. ఇక్కడ మరణించిన వారిని తిరిగి తమ స్వగ్రామాలకు తీసుకెళ్లలేక చాలామంది అంత్యక్రియల భారాన్ని ఆస్పత్రులపైనే వదిలివేస్తున్నారు. వీరి అంత్యక్రియలకు ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటమే కాక ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం వీలైనన్ని దహన వాటికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న గ్యాస్ ఆధారిత దహన వాటికను గత నెలలో ఎర్రగడ్డ శ్మశానవాటికలో ప్రయోగాత్మకంగా వాడి చూశారు. పలు లోపాలుండటంతో వాటిని సరిచేస్తామని సంబంధిత ఏజెన్సీ తెలిపింది.
కానీ.. దానివల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటాన్ని దృష్టిలో ఉంచుకొని విరమించుకున్నారు. ఢిల్లీ తదితర ఉత్తరాది నగరాల్లో వాడుతున్న దహనవాటికలను పరిశీలించిన అధికారులు అవి ఉపయోగకరంగా ఉన్నాయని భావించి అలాంటివి నాలుగు తెప్పించారు. ఒక్కో విద్యుత్ దహన వాటికకు దాదాపు రూ. 45 లక్షలు వ్యయం కాగా, అవసరమైన షెడ్డు, ఇన్‌స్టలేషన్ పనులు తదితరమైన వాటికి వెరసి రూ. 88 లక్షలవుతుంది. వీటిని చార్మినార్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వాటి అమరిక పనులు జరుగుతున్నాయి. ఈ వారాంతంలోగా ఇన్‌స్టలేషన్ పనులన్నీ పూర్తిచేసి, వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేస్తున్నారు. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌తో పనిచేసే వీటికి ఒక్కో మృతదేహానికి ఒక గ్యాస్ సిలిండర్ సరిపోతుందని, దాదాపు 75 నిమిషాల్లో మృతదేహం దహనం అవుతుందని అధికారులు తెలిపారు. దహనం చేయాల్సిన మృతదేహాలు పెరిగే కొద్దీ.. ఈ సమయం 45 నిమిషాలకు తగ్గిపోతుందని పేర్కొన్నారు. గతంలో మూతపడ్డ అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, ఎర్రగడ్డ శ్మశానవాటికల్లోని విద్యుత్ దహన వాటికలను కూడా వినియోగంలోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.