Telangana Vaccination: తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ కష్టాలు
* కొత్త వాళ్లకు నో ఫస్ట్ డోస్ * ఇన్‌టైమ్‌లో దొరకని సెకండ్ డోస్ *రాష్ట్రంలో సెకండ్ డోస్ కోసం 35లక్షల మంది వెయిటింగ్
Telangana Vaccination: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగిస్తుండటంతో కరోనా కట్టడి కొద్దివరకు సాధ్యమైంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తగిన మొత్తంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. కొత్త వాళ్లకు ఫస్ట్ డోస్ దొరకడం లేదు. అలాగే.. మొదటి డోస్ తీసుకున్నవారికి సరైన సమయానికి సెకండ్ డోస్ వేయడం లేదు.
తెలంగాణ వ్యాప్తంగా 15లక్షల 32వేల మందికి ఇన్‌టైమ్‌లో రెండో డోసు అందలేదు. ఫస్ట్ డోసు కొవిషీల్డ్ తీసుకుని నూటపన్నెండు రోజుల గడువు దాటిపోయినవాళ్లు 12లక్షల 32 వేల మంది ఉండగా, కొవాగ్జిన్ గడువు దాటిపోయినవాళ్లు 3 లక్షల మంది ఉన్నారు. సెకండ్ డోస్ కోసం రోజూ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ప్రజలు పడిగాపులు పడుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ వ్యాక్సిన్ దొరకడం లేదని వాపోతున్నారు.
జులై నెలలో మన రాష్ట్రానికి సుమారు 31 లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అయితే జులై నెలలో సుమారు 34 లక్షల మందికి సెకండ్ డోస్ వేయాల్సి ఉండగా 19 లక్షల మందికే ఇచ్చారు. మిగిలిన డోసులను ఫస్ట్ డోస్‌గా ప్రజలకు అందించారు. ఒకవేళ జులై నెలలో అందిన అన్ని టీకాలను సెకండ్ డోస్ వారికే వేసి ఉంటే దాదాపు అందరికీ రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేది. ఇప్పుడు ఆగస్టులో సెకండ్ డోస్ తీసుకోవాల్సినవారి సంఖ్య 20 లక్షల మందికి పైనే ఉన్నారు. జులైలో మిగిలినవారితో కలిపి, మొత్తంగా ఆగస్టులో 35లక్షల మందికి సెకండ్ డోవ్ వేయాల్సి ఉంది.