COVID-19 fear: వణికిస్తోన్న కరోనా.. పల్లెలు, పట్నాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

Update: 2020-08-06 05:20 GMT

COVID-19 fear: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి. కరోనా భయంతో పల్లె, పట్నం అని తేడా లేకుండా సంపూర్ణ లాక్ డౌన్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో స్వీయ నియంత్రణతో కరోనాని కట్టడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే 60శాతం పల్లెలు స్వచ్చంద లౌక్ డౌన్ పాటిస్తుండగా మున్సిపాలిటీలు కూడా అదే బాటను ఎంచుకుంటున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కరోనా వైరస్ పంజా విసిరింది. రోజురోజుకు పాజిటివ్ కేసుల పెరగడంతో పాటు మరణాల సంఖ్య అదే స్దాయిలో పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 2200 పాజిటివ్ కేసులు నమోదు కాగా సుమారు 50 మంది మృత్యువాత పడ్డారు. దీంతో 16 మండలాల పరిధిలోని 90 గ్రామాలు స్వచ్చంద లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే గ్రామాభివృద్ది కమిటీల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తున్నారు.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కరోనా కేసులు రికార్డు స్ధాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్క నిజామాబాద్ లోనే 7 వందలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయంటే పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ 3 వందలకు పైగా కేసులు ఉండటంతో ఈనెల 5 నుంచి లాక్‌డౌన్‌ చేయాలని అఖిలపక్షం, ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార వాణిజ్య సంస్ధలు నిర్ణయించాయి.

బాన్సువాడ పట్టణంలో 120 పాజిటివ్ కేసులు ఉండటంతో పట్టణాన్ని లాక్ చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. ఈనెల 7 నుంచి 17 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. ఆర్మూర్ లో కేసులు పెరగడంతో లాక్ డౌన్ అమలు చేసేందుకు నిర్ణయించారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని సంఘాలు ఈ మేరకు ఓకే చెప్పాయి. ఆగస్టు 1 నుంచి నవీపేటలో లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో ఆటోతో ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెలలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ‌్యంలో అటు జనం, ఇటు అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News