Coronavirus Tension in Singareni: సింగరేణిలో 5 వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
Coronavirus Tension in Singareni : సింగరేణిలోనూ కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సింగరేణి భూగర్భ గనుల్లో వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే సింగరేణి సంస్థ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు, ప్రైవేటు ఆసుపత్రులతో అత్యవసర సేవల ఒప్పందం వంటి చర్యలు చేపట్టింది. సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్, పా), ఎం.బలరాం (ఫైనాన్స్)లు సింగరేణి సంస్థ ఎండీ ఎన్.శ్రీధర్ నేతృత్వంలో తీసుకున్న చర్యలను ఏరియా మేనేజర్లకు వివరించారు. అనంతరం కరోనాపై తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సింగరేణిలో కరోనా ను కట్టడి చేయడానికి గాను సంస్థ హెటిరో సంస్థ తయారు చేసిన 1,800 ఖరీదైన ఇంజక్షన్ డోస్‌లను, అదే విధంగా ర్యాపిడ్ టెస్టుల కోసం ఐదువేల కిట్లను కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు. అంతే కాకుండా హైదరాబాద్‌లో వెంటిలేటర్ సౌకర్యం కలిగిన మూడు ఆసుపత్రులతో అత్యవసర పరిస్థితుల్లో సింగరేణి ఉద్యోగులకు చికిత్స అందించేందుకు సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా సింగరేణి సంస్ధ కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను, ఈ డోస్‌లను గురువారంలోగా ఏరియా ఆసుపత్రులకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
కరోనా వైద్య సేవల్లో పాల్గొంటున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనంతో పాటు రోజుకు రూ.300 చొప్పున అదనంగా చెల్లించాలని సంస్థ నిర్ణయించింది. సింగరేణి ఆసుపత్రులతో పాటు క్వారంటైన్ సెంటర్లలో పనిచేసే వైద్య సిబ్బందికి అవసరమైన సహాయ సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్ సూచించారు. అన్ని ఏరియా ఆసుపత్రుల్లోనూ పూర్తి సౌకర్యాలతో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఎండీ ఆదేశించారు.