Coronavirus Outbreak in Nizamabad: ఇందూరును వణికిస్తున్న కరోనా.. కలవర పడుతున్న ప్రంట్ లైన్ వారియర్స్

Update: 2020-07-21 07:21 GMT

Coronavirus Outbreak in Nizamabad: ఇందూరును కరోనా భయం వెంటాడుతోంది. ఒక్కొక్కరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది మహమ్మరి బారిన పడటం జిల్లా వాసులను కలవరపెడుతోంది. దీంతో పలు కార్యాలయాలకు తాళాలు వేశారు అధికారులు. అటు ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 6 వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా కాటుకు 20 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో నిజామాబాద్ DRO కార్యాలయంలో పనిచేసే అటెండర్ ఉండటం కలెక్టరేట్ ఉద్యోగుల్లో ఆందోళనకు గురిచేసింది. దీంతో కలెక్టరేట్ లో అధికారులు ఆంక్షలు విధించారు. వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చే వారికి కార్యాలయంలోకి అనుమతించడం లేదు. ఫిర్యాదుల కోసం ఓ బాక్సును ఏర్పాటు చేశారు.

ఇక వైద్యులు, వైద్య సిబ్బందిని కూడా కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో 20 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. జిల్లా ఆసుపత్రిలో ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ వచ్చింది. బోధన్ లో ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు వైద్యాధికారులు, ఆర్మూర్ డివిజన్లో ఓ మెడికల్ ఆఫీసర్, మెడికల్ కళాశాలకు చెందిన ఇద్దరు వైద్యులు, ఖలీల్ వాడిలో ముగ్గురు వైద్యులకు కరోనా సోకింది. ఆర్మూర్ కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు కరోనాతో గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందడం వైద్య వర్గాల్లో కలకలం సృష్టించింది..

కామారెడ్డి జిల్లాలోను కరోనా పంజా విసురుతోంది. పోలీసులు- రెవెన్యూ శాఖ ఉద్యోగులకు కరోనా సోకడంతో. ఎల్లారెడ్డిలో తహసిల్దార్ కార్యాలయంతో పాటు ఆర్డీఓ కార్యాలయాలకు తాళాలు వేశారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లోని రైటర్ కు పాజిటివ్ వచ్చింది. దీంతో అతనికి ప్రైమరీ కాంటాక్టులో ఉన్న సుమారు 30 మందిని క్వారంటైన్ చేశారు. బాన్సువాడ ఆర్డీఓ కు సైతం కరోనా నిర్ధారణ అయ్యింది. ఇలా వరుసగా ప్రభుత్వాధికారులను కరోనా వెంటాడుతుండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News