Coronavirus Impact On House Rent's in Nizamabad : ఒకప్పుడు ఆ నగరంలో అద్దెకు ఇల్లు దొరకడమే కష్టమయ్యేది. దొరికినా అద్దె చాలా ఎక్కువుండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉన్న ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. కొన్నాళ్లు సొంతూళ్లకు పోయి కరోనా తగ్గిన తర్వాత వస్తే బెటర్ అనే ఆలోచనతో చాలా మంది సిటీ వదిలి వెళ్లిపోతున్నారు. దీంతో టులెట్ బోర్డులు కనిపిస్తున్నాయి.
నిజామాబాద్ నగరం ఖాళీ అవుతోంది. కరోనా మహమ్మారి విజృంభనకు ముందు ఇళ్లు అద్దెకు దొరకాలంటే కనీసం వారం రోజుల పాటు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్ధితి లేదు. కరోనా దెబ్బకు చాలా వరకు అద్దె ఇళ్లు ఖాళీ అయ్యాయి. ప్రతీ కాలనీలో పదుల సంఖ్యలో టులెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. మునుపెన్నడు లేని విచిత్ర పరిస్ధితి కనిపిస్తుంది. అద్దెల పై వచ్చే ఆదాయంతో జీవనం సాగించే ఇళ్ల యజమానులు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నారు.
నిజామాబాద్ నగరలో అద్దె పోర్షన్లు 60 నుంచి 80 వేల వరకు ఉంటాయి. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కుటుంబాలు ఇక్కడే ఉంటున్నారు. విద్యా సంస్ధలు మూతపడటం, చిన్నా చితక వ్యాపారాలు నిలిచిపోవడంతో ఆర్ధిక భారంతో కొందరు కరోనా భయంతో మరికొందరు సొంతూళ్లకు పయనమయ్యారు. ఇళ్లు ఖాళీ చేస్తుండంతో ఇబ్బందిగా మారిందని ఇంటి యజమానులు చెబుతున్నారు. జనరల్‌గా నగరానికి రోజూ వందల, వేల మంది వస్తుంటారు. ఇప్పుడు మాత్రం వెళ్లేవారే తప్ప వచ్చేవారు పెద్దగా లేరు. చివరకు కరోనాకి వ్యాక్సిన్ వస్తే తప్ప తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చేలా కనిపించట్లేదు.