Coronavirus: ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కలకలం
Coronavirus: జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 680 మందికి పరీక్షలు * 31 మందికి కరోనా నిర్ధారణ
Coronavirus: ఆదిలాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 680 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 31 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో భయాందోళనకు గురవుతున్నారు జిల్లా ప్రజలు. మరోవైపు బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల్లో ఐదుగురు విద్యార్థినులు కరోనా బారిన పడడం కలవరం పెడుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు మళ్లీ కొవిడ్ భయం పట్టుకుంది. పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో.. దాని ప్రభావం జిల్లాపై పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ఒకటి, రెండు కేసులు నమోదు కాగా గడిచిన రెండ్రోజులుగా వాటి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. బుధవారం నాడు 638 మందికి పరీక్షలు నిర్వహించగా.. 18 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే గురువారం రోజున 680 మందికి టెస్టులు చేపట్టగా 31 మందికి కరోనా నిర్ధారణ అయింది.
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు మార్చి 1న రిమ్స్‌లో చేరగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో జిల్లాలో కరోనా బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 49కి చేరింది. 8 రోజుల వ్యవధిలో జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు ప్రతిక్షణం భయంతో బతుకుతున్నారు.
మరోవైపు కరోనా మహమ్మారి స్కూళ్లల్లో వ్యాప్తి చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. బోథ్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల్లో ఓ విద్యార్థినిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అక్కడి వైద్యాధికారి పీహెచ్‌సీకి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది.. స్కూళ్లో శిబిరం ఏర్పాటు చేసి 38 మంది విద్యార్థులతో పాటు 10 మంది సిబ్బందికి కరోనా టెస్టులు చేశారు. మరో నలుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్ రాగా.. వారిని ఇళ్లకు పంపించారు అధికారులు. మిగిలిన వారిని స్కూళ్లోనే ఐసోలేట్ చేశారు. పాఠశాలను పూర్తిస్థాయిలో శానిటైజ్ చేశారు.