Sri Rama Navami 2021: భద్రాద్రి ఉత్సవాలకు కరోనా ఎఫెక్ట్
Sri Rama Navami 2021: నిరాడంబరంగా భద్రాద్రి రాములోరి కల్యాణం * నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Sri Rama Navami 2021: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి పండుగల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. గతేడాదిలో నిర్వహించినట్లుగానే పరిమిత సంఖ్యలోనే కోవిడ్ నిబంధనలకు లోబడి వేడుకను జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. స్వామివారి ఆలయంలోనే శ్రీరామనవమి వేడుకలను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహిస్తామన్నారు.
కరోనా దృష్ట్యా భక్తులు ఎవరూ శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యగా భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు పరిస్థితిని అర్ధం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని కోరారు. ఆన్ లైన్ లో కళ్యాణ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తుల డబ్బులు తిరిగి చెల్లిస్తామని మంత్రి తెలిపారు.