కాటేసిన కరోనా..ముంచేసిన వాన..చితికిపోయిన డ్రైవర్ల జీవితాలు!
లాక్ డౌన్ సమయంలో కుదేలైన క్యాబ్ డ్రైవర్ల జీవితాలు కుదుట పడుతున్నాయి అనే లోపే భారీ వర్షాలతో మళ్ళీ కునారిల్లాయి.
ఒకవైపు దశలవారీగా కొనసాగుతున్న లాక్‌డౌన్ మరోవైపు తగ్గని కరోనా ఉధృతితో అనేక మంది ఉపాధి కోల్పోయారు. కన్నీళ్లను దాటుకొని జీవనం సాగిస్తున్న వారిపై ప్రకృతి పంజా విసిరింది. ఇటీవల ఏడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కన్నీళ్లు మిగిల్చాయి. క్యాబ్‌లు నీట మునిగి కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో బాధ్యత మోయలేని భారమై వెంటాడుతోంది.
సుధీర్ఘ లాక్‌డౌన్ తర్వాత రోడ్డెక్కిన క్యాబ్ డ్రైవర్లకు మళ్లీ నిరాశే మిగిలింది. లాక్‌డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న ఓలా, ఉబెర్ డ్రైవర్లపై మరో పిడుగు పడింది. ఇటీవల కురిసిన బారీ వర్షాలతో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఇల్లు మునిగి కొందరు, వాహనాలు మునిగి మరికొందరు తీవ్రంగా నష్టపోయారు. ఇక కరోనా వల్ల స్కూళ్లు, కాలేజీలు లేకపోవడంతో కుటుంబం పోషణ కష్టంగా మారిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక వేలాది కుటుంబాలు ఓ పూట తింటూ మరో పూట పస్తుటుంటున్నాయని చెబుతున్నారు.
ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఫైనాన్స్ వేధింపులు ఎక్కువైయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద తమకు నష్టపరిహారం చెల్లించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో డ్రైవర్ కు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. మొత్తంగా ఒకవైపు కరోనా మరోవైపు వందేళ్ల అత్యధిక వర్షపాతం కొద్ది గంటల్లోనే నమోదు కావడంతో రోడ్లు, నాలాలు ఏకమై కార్లు పడవలై తేలిపోయాయి. దీంతో డ్రైవర్లు నిర్వేదంలో మునిగిపోయారు. కారు పాడయిందన్న బాధ కన్నా ఇప్పుడు పూట గడవడం ఏట్ల అన్న ఆందోళన వారిని కలవరపెడుతోంది.