Corona: ఇందూరులో పంజా విసురుతున్న కరోనా
Corona: రోజుకు 2 వేలకు పైగా వైరస్ బారిన పడుతున్న జనం * కరోనా కారణంగా ప్రజావాణి కార్యక్రమం వాయిదా
Corona: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రోజుకు 2 వేలకు పైగా జనం వైరస్ బారిన పడుతుండటంతో... జనం భయంతో వణికిపోతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కరోనా కారణంగా వాయిదా వేశారు అధికారులు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం, సర్కారు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ నిండిపోవడంతో పల్లె జనం స్వచ్చంద లాక్ డౌన్ విధిస్తూ స్వీయనియంత్రణ పాటిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 27 మండలాలు ఉండగా 10 మండలాల పరిదిలో 50 కి పైగా గ్రామాలు స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 10 కాలనీలను కంటెన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. బోధన్‌లోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలను మూసేశారు. చాలా గ్రామాలు పూర్తిస్దాయి బంద్ పాటిస్తుంటే కొన్ని గ్రామాల్లో ఆంక్షలను అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు గ్రామ పెద్దలు.
మహారాష్ట్ర ముప్పు జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా మహారాష్ట్ర తెలంగాణ సరిహాద్దుగా ఉన్న చాలా గ్రామాల్లోకి ఎంట్రీని నిలిపేసారు గ్రామాస్దులు. కామారెడ్డి జిల్లాలోని మహారాష్ట్ర కర్నాటక తెలంగాణ సరిహాద్దు గ్రామాలుగా ఉన్న సలాబత్ పూర్ చెక్ పోస్టు మినహా మిగితా దారులన్నీ కంచెలతో అడ్డుకట్ట వేసారు. మద్నూర్ మండలంలోని చిన్న శక్కర్లా గ్రామంలోను ఇలానే కందకాలు తీసి ఇతర రాష్ట్రాల నుండి దొడ్డిదారిన వస్తున్న వారిని అడ్డుకుంటున్నారు. ఇక బోదన్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్దితి కనపడుతోంది.
జిల్లాలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పాటికే ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. కేసుల సంఖ్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసులు పెరిగితే.. క్రమంగా ఇందూరు మొత్తం లాక్ డౌన్ అయ్యే అవకాశం ఉంది.