Nizamabad: నిజామాబాద్ జిల్లాపై రేవంత్ ఫోకస్.. రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.

Update: 2024-06-27 07:38 GMT

Nizamabad: నిజామాబాద్ జిల్లాపై రేవంత్ ఫోకస్.. రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలం పెరుగుతుండగా గత ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన బీఆర్ఎస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గ్రాఫ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పడిపోతోంది. జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై గురిపెట్టిన అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది.

మొన్నటి ఎన్నికలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కేసీఆర్‌ను దెబ్బతీసేలా ముందుకు సాగుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటిలోకి చేర్చుకున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో పట్టు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంట్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. బాన్సువాడలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు. మూడు స్థానాల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగుర వేసింది. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బాజిరెడ్డి గోవర్థన్, బోధన్ నుంచి షకీల్, ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, జుక్కల్ నుంచి హన్మంతు షిండే పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ ఓటమి పాలవడమే కాకుండా డిపాజిట్ సైతం కోల్పోయారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన రెండు స్థానాల్లో బాన్సువాడ ఒకటి కాగా, ఇప్పటికే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరే బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు వేముల ప్రశాంత్ రెడ్డిని కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ఆయన కూడా కారు దిగి హస్తం పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

అయితే తాను పార్టీ మారనని ఎక్కడా ప్రకటన చేయలేదు ప్రశాంత్ రెడ్డి ఒకవేళ ఆయన కూడా పార్టీ మారితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో లాగే ఇక్కడా బీఆర్ఎస్ పార్టీని జీరో చేసేందుకు టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేశారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News