టీపీసీసీ పదవిపై స్పందించిన జీవన్‌రెడ్డి..

Update: 2021-01-05 10:16 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా జీవన్‌‌రెడ్డి పేరు ప్రకటిస్తారన్న ప్రచారంతో ఆయన ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు క్యూ కట్టారు. ఇవాళ జీవన్‌రెడ్డి పుట్టినరోజు కూడా కావడంతో కార్యకర్తలు జీవన్ రెడ్డికి అభినందనలు చెబుతున్నారు. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఇవాళ సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనాలో ఉన్నాయి. వారం క్రితమే జీవన్ రెడ్డిని ఢిల్లీ పిలిపించుకుని అధిష్టానం మాట్లాడింది. దాంతో ఇవాళ కొత్త సారథి పేరు ఫైనల్ కానున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీ మారుతామని చాలా మంది నేతలు అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. ఇప్పుడు సీనియర్ ఖాతాలో పీసీసీ చీఫ్ పదవి జీవన్ రెడ్డికి ఇచ్చే యోచనలో ఉంది. జీవన్ రెడ్డికి చీఫ్ పదవి ఇస్తే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకొని పోతారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది.  

పీసీసీ పదవి అప్పగింతపై జీవన్‌రెడ్డి స్పందించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో సేవ చేస్తున్నానని, అధిష్టానం ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అయితే పీసీసీ పదవిపై ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. వ్యక్తిగతంగానూ తనకు పిలుపు అందలేదని తెలిపారు. అయితే ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని వెల్లడించారు. కాగా టీపీసీసీ పదవికి ఎంపీ రేవంత్‌ రెడ్డితో పాటు, కోమటిరెడ్డి తీవ్రంగా పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఇరువురి ఏ ఒక్కరికి నిరాశ మిగిల్చిన పార్టీలో చీలికలు వస్తాయని భావించిన హస్తం అధిష్టానం.. సీనియర్‌ నేతైన జీవన్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనిపై నేడోరేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Tags:    

Similar News