ఈడీ విచారణపై కాంగ్రెస్ నిరసనల హోరు
Congress Protest: *ఇవాళ రాజ్ భవన్ ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపు
Congress Protest: రాహుల్ గాంధీపై ఈడీ విచారణ కొనసాగుతుండటంతో మూడవ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేసింది. ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ నేతలపై పోలీసుల దాడితో నేటి నుండి ఆందోళనలు మరింత పెంచడానికి ఏఐసీసీ కొత్త యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది. రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని రేవంత్ రెడ్డి , జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
గాంధీ కుటుంబం ఈడీ విచారణతో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుండి గల్లీ వరకు మూడవ రోజు నిరసనలు హోరెత్తించారు. ఏఐసిసి పిలుపు మేరకు గురువారం ఉదయం రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చినట్లు పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్డ ఎత్తున పాల్గొనాలని రేవంత్ సూచించారు. ఉదయం 10 గంటలకే ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలకు రేవంత్ సూచించారు.
రాహుల్ పాదయాత్ర చేస్తే పెట్రోల్ , డీజల్, గ్యాస్ , నిత్యావసర ధరలు పెంచిన దానిపై ప్రశ్నిస్తారనే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఏఐసిసి కార్యాలయంలోకి పోలీస్ లు చొరబడి దాడి చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడితో గవర్నర్ కు సైతం నిద్ర పట్టోద్దని రాజ్ భవన్ గేట్లు బద్దలు కొడుతామన్నారు జగ్గారెడ్డి. ఈడీ దర్యాప్తుపై కాంగ్రెస్ నేతల నిరసన దీక్ష రోజు రోజుకు ఉధృతమవుతుంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ నిరసనలకు అనుమతించిన ప్రభుత్వం రాజ్ భవన్ ముట్టడికి ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.