మునుగోడు ఉప ఎన్నికలో దూకుడు పెంచిన కాంగ్రెస్

*ముఖ్యనేతలతో రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సమావేశం

Update: 2022-10-06 03:39 GMT

మునుగోడు ఉప ఎన్నికలో దూకుడు పెంచిన కాంగ్రెస్ 

Congress: మునుగోడు ఎన్నికల్లో ప్రచారంలో మరింత దూకుడు పెంచేలా కార్యాచరణ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ... భారీ బహిరంగ సభల కంటే మండల స్థాయి సమావేశాలే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చింది. దసరా తర్వాత నాయకులంతా నియోజకవర్గంలోనే ఉండాలని అధిష్టానం ఆదేశించింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళుతోంది..

మునుగోడు ఎన్నిక షెడ్యూల్ రావడంతో రాజకీయ పార్టీలు తన కార్యచరణలో మరింత వేగం పెంచాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ గాంధీభవన్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. మునుగోడు నియోజకవర్గ అభ్యర్థితోపాటు.. నియోజకవర్గంలోని మండల ఇంచార్జిలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎదుర్కోవాల్సిన అంశాలపై చర్చించారు. ఆర్థిక పరమైన అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం.. పోల్ మేనేజ్‌మెంట్ లాంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.

మునుగోడు ఉప ఎన్నికలకు తోడు.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా ఉండడంతో రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలని సమావేశంలో చర్చకు వచ్చింది. మునుగోడులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్న సభలు, సమావేశాల నిర్వహణపై చర్చ జరిగింది. ఈనెల 7 నుంచి 13 వరకు నియోజకవర్గమంతా రేవంత్ రెడ్డి పర్యటిస్తూ.. సభలతో ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించారు. 14న పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ భారీ జనసమీకరణ మధ్య వేయాలని తీర్మానించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు మున్సిపాలిటీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభలు నిర్వహించబోతుంది కాంగ్రెస్.

మునుగోడు ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి వస్తారా...? లేదా...? అనే దానిపై చర్చ జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి వస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటిచ్చారని అభ్యర్థి పాల్వాయి స్రవంతి చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికలు ఆర్థిక భారమవడంతో ఆ సమస్య నుంచి బయటపడడం ఎలా అనే దానిపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. నిధులు సమకూర్చే అంశంపై పార్టీ ముఖ్య నాయకులు చొరవ తీసుకోవాలని ఇంచార్జి సూచించారు. పోల్ మేనేజ్మెంట్, క్యాడర్ని కాపాడుకోవడం ఒక ఎత్తయితే.... ఉప ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడం మరో ఎత్తు.... కాగా.... కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది.

Tags:    

Similar News