తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Cold Intensity: ఏజెన్సీని వణికిస్తున్న చలి
Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. తెలంగాణలో చలి పులి చంపేస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రుళ్లు చలి ఇబ్బంది పెడుతుంది. తెలంగాణ, ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు చేరుకుంటున్నాయి. శీతలగాలులు ఇదే విధంగా కొనసాగితే పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, గిన్నెదరి ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్, తిర్యానీ, సోనాల, బేల, బజార్ హత్నూర్, పొచ్చెరలో, పెంబిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శీతల గాలుల ప్రభావం పెరిగింది. రాబోయే 2-3 రోజులు ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. చలికితోడు పొగ మంచు కూడా కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోపక్క ఏపీలో చలి గాలుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో చలితీవ్రత పెరిగింది. చింతపల్లి, పాడేరు తదితర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.