coal mafia in singareni: వాళ్లు బంకర్లను బరితెగించి కన్నెం వేస్తారు. వ్యాగన్లలో తరలుతున్న బొగ్గును దోచుకుంటారు. ఒక్కోసారి వ్యాగన్ నిలబడిన చోటనే బొగ్గును మాయం చేస్తారు. సింగరేణిలో బొగ్గు మాఫియా పాగా వేసింది. ఏటా వందల కోట్ల రూపాయల విలువైన బొగ్గును దోచుకుంటుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి , బెల్లంపల్లి , శ్రీరాంపూర్ బొగ్గు గనుల వద్ద కోట్లాది రూపాయల విలువైన బొగ్గు లూటీ అవుతుంది. బంకర్ల నుంచి ఎన్ టిపిసీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలుతున్న బొగ్గును చోరీ చేస్తుంది.
బొగ్గు గనుల నుంచి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా వేల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ సరఫరా చేస్తుంది. వ్యాగన్లలో బొగ్గు తరలుతున్న సమయంలో దారిమధ్యలో మాఫియా దోపిడీ చేస్తుంది. ఒక్కోసారి వ్యాగనులు నిలబడిన చోట బొగ్గును దొంగతనం చేస్తుంది. సింగరేణి బొగ్గుగనుల్లో లూటీ చేసిన బొగ్గును పరిశ్రమలు, ఇటుకబట్టీలకు మాఫియా అమ్ముతుంది. ఒక లారీ బొగ్గును 80 వేల నుంచి లక్షా రూపాయల వరకు విక్రయిస్తుంది. ఏటా చోరీకి గురి అవుతున్న బొగ్గు విలువ వందల కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా, బొగ్గు దొంగ ముఠా వల్ల సింగరేణి సంస్థకు తీవ్రమైన నష్టం వస్తోంది. బొగ్గు మాఫియతో కొందరు సింగరేణి అధికారులు మిలాఖత్ కావడంవల్లే బొగ్గు లూటీ అవుతుందని ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో బొగ్గు మాఫియా భరతం పట్టాలని సింగరేణి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.