CM Revanth Reddy : విజయమే లక్ష్యంగా పని చేయాలి..
CM Revanth Reddy : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ముఖ్యనాయకులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశమయ్యారు.
CM Revanth Reddy : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ముఖ్యనాయకులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశమయ్యారు. నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నాయకులతో టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తోపాటు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, ప్రధానంగా డీఎస్‌సీ ద్వారా 11 వేల ఉద్యోగాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థ, రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీ లాంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతుందని ఆయన వివరించారు.
టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలని, కనుక అత్యంత పకడ్బందీగా.. వ్యూహాత్మంగా ముందుకు సాగాలని ఆయన సీఎం సూచించారు. ఈనెల 15వ తేదీ వరకు ఈ ఎన్నికలకు సంబంధించి ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థి ఎంపిక కోసం సీనియర్ నాయకులు నుంచి అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. అన్నివిధాల గెలుపు అవకాశాలున్న నాయకుడిని అభ్యర్థిగా నిలబెట్టాలని, ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి, ఎన్నికల సమన్వయ వ్యూహాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ఓటరు నమోదు పెద్దఎత్తున చేపట్టాలని ఇంచార్జి దీపదాస్ మున్షీ చెప్పారు. కొత్త ఓటర్ల నమోదులో ప్రత్యేక చర్యలు తీసుకొని, పాత ఓటర్లు, కొత్త ఓటర్లను మన వైపు ఆకర్షించేలా పకడ్బందీగా ప్రణాళిక చేపట్టాలని సూచించారామె.
ఓటర్ల నమోదు, సమన్వయ కమిటీ, పని విభజన, అభ్యర్థి ఎంపిక వెంటనే చేపట్టాలని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని, నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అభ్యర్థి విజయాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని సూచించారాయన... ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికలకు పూర్తిస్థాయి బాధ్యత తీసుకొని పనిచేయాలని ఆయన కోరారు.
గత ఎన్నికల్లో తన అభ్యర్థిగా పోటీ చేసే సమయంలో కొంత సానుభూతి వ్యక్తమయిందని, అది విజయానికి దోహదపడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈసారి అభ్యర్థి ఎంపిక ఓటర్ల నమోదు చాలా కీలకమని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, విజయం సాధించాలని, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నందున ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గెలవడం చాలా ముఖ్యమన్నారాయన.