Modi Vs KCR: ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ప్రశ్నలు
Modi Vs KCR: ఇవాళ జరిగే బీజేపీ సంకల్ప సభపై సర్వత్రా ఆసక్తి
MODI vs KCR: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రెండో రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్‌లో మకాం వేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. పక్కాగా వాటిని అమల్లో కూడా పెట్టారు. ఫ్లెక్సీల విషయంలో కావొచ్చు, రాజకీయ విమర్శల విషయంలో కావొచ్చు, గులాబీ శ్రేణులు కేసీఆర్ వ్యూహాలకు అనుగుణంగానే నడుచుకున్నారు.
కొంత కాలంగా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్.. యశ్వంత్ సిన్హా ప్రచార కార్యక్రమంలో మరోసారి బీజేపీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. ప్రధాని మోడీని సేల్స్‌మెన్‌తో పోల్చారు. అంతేకాదు పలు ప్రశ్నలు సంధించి బీజేపీ సభలో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది. మే నెలలో హైదరాబాద్‌కు వచ్చిన మోడీ.. బేగంపేట ఎయిర్ పోర్టులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. తాజాగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ జరుగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గాల రోజే విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని హైదరాబాద్‌కు రప్పించి హడావుడి చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోనూ రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు, టీఆర్ఎస్ బ్యానర్లు కట్టారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ సర్కార్‌తో పాటు సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో జోష్ వచ్చేలా మోడీ ప్రసంగం ఉండబోతుందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. దీంతో పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారన్నది ఉత్కంఠగా మారింది.