CM KCR: ఇవాళ ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ
CM KCR: మ.1.48 నిమిషాలకు భూమిపూజ చేయనున్న సీఎం కేసీఆర్
CM KCR: ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని స్థాపించాలన్న టీఆర్ఎస్ కల.. సాకారం కానుంది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటా 48 నిమిషాలకు వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. 2020 అక్టోబర్ 9న 11 వందల చదరపు మీటర్ల భూమిని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్రం కేటాయించింది. పార్టీ ఆఫీస్ భూమి కోసం టీఆర్‌ఎస్ 8 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించింది.
కాగా 40 కోట్ల అంచనా వ్యయంతో పార్టీ భవన్‌ను నిర్మిస్తున్నారు. మీటింగ్ హాల్‌తోపాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చేవారు స్టే చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉండేలా భవన నిర్మాణానికి డిజైన్ చేశారు. ఢిల్లీలో నిర్మాణం చేయబోయే కార్యాలయ భవనం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను పోలి ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆఫీస్ నిర్మాణం పూర్తయితే ఢిల్లీలో శాశ్వత కార్యాలయమున్న వన్ అండ్ ఓన్లీ పార్టీగా టీఆర్ఎస్ అవతరించనుంది. అయితే.. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరగాల్సి ఉండగా కరోనా వల్ల అదికాస్త వాయిదా పడింది.
ఇప్పటికే భూమిపూజ జరిగే స్థలం దగ్గర ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎంపీలు అక్కడకు చేరుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదని, టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఆఫీసును నిర్మించుకోవడంపై నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీలో కార్యాలయాలు ఎక్కువగా ఉండవు. ఐదేళ్లకోసారి బలాబలాలు మారిపోతూంటాయి. అందుకే చాలా పార్టీలు ఢిల్లీ కార్యాలయం గురించి ఆలోచించలేదు. కానీ కేసీఆర్ మాత్రం చాలా రోజులుగా ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్‌ను నిర్మించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన పట్టుదల ఇప్పటికి సాకారం అవుతోంది.
ఇక ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటుతో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర షోపించనుందని రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్న టీఆర్ఎస్ చీఫ్ మళ్లీ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారన్న అభిప్రాయం బలపడుతోంది. త్వరలో ఆయన మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తారని, హస్తినలో కట్టబోతున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచే దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని గుసగులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో మూడ్రోజుల పాటు పర్యటించనున్న సీఎం కేసీఆర్.. రేపు హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.