కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం

*ఇవాళ సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

Update: 2022-02-23 01:39 GMT

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం

CM KCR: కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ నేడు ప్రారంభం కానుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన భారీ రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌‌లోకి అధికారికంగా నీటి విడుదలకు రంగం సిద్ధమైంది. 50 టీఎంసీల సామర్థ్యంతో సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల సరిహద్దులో దీన్ని నిర్మించారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రిజర్వాయర్‌ను ప్రారంభించనున్నారు.

సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్‌ పంపుహౌస్‌కు చేరిన గోదావరి జలాలను ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. మల్లన్నసాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు, అక్కడి నుంచి గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు, మరో కాల్వ ద్వారా సంగారెడ్డిలోని మంజీర రిజర్వాయర్‌కు, హల్దీవాగు నుంచి మంజీర నదిలోకి.. అక్కడి నుంచి నిజాంసాగర్‌కు వెళ్లేలా ప్లాన్ చేశారు. గత వేసవిలో హల్దీవాగు నుంచి నిజాంసాగర్‌కు నీటిని విజయవంతంగా తరలించారు.

ఇక ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, జనగామ, మేడ్చల్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని దాదాపు 12 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారిక సమాచారం. ఈ రిజర్వాయర్‌‌లో నీరు ఉంటే వేసవిలోనూ అన్ని అవసరాలకు ఉపయోగపడనుంది. అందుకే మిడ్‌మానేరు నుంచి అన్నాపూర్‌, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్ల మీదుగా ఎత్తిపోతలతోపాటు అదనపు టీఎంసీ కాలువకు సైతం శ్రీకారం చుట్టారు. వానాకాలంలో రోజుకు 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, దీని పరిధిలోని రిజర్వాయర్లకు తరలిస్తారు.

Full View


Tags:    

Similar News