CM KCR: ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: కొత్త కలెక్టరేట్, ఎస్పీకార్యాలయాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లా ఎస్పీ ఆఫీస్ తో పాటు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ భవనాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపద్యంలో జరుగుతున్న ముఖ్యమంత్రి పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభలో ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేశారు. అన్ని నియోజకవర్గాలనుంచి భారీగా జనం వచ్చేవిధంగా ఏర్పాట్లు చేశారు. గత వారం రోజులగా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సిఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ తమ తమ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సీఎం వస్తుండటంతో జిల్లా కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణమంతా గులాబీమయమైంది.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం శివారులోని కొల్లాపూర్ రహదారిలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు ఎస్పీ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభంతో అన్ని రకాల సేవల ప్రజలకు ఒకే దగ్గర అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయడంతో పాటు అధునిక కలెక్టరేట్ భవనాలు ఒక మైలురాయిగా మారనుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం కేసీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. మొదట కలెక్టరేట్ భవనాన్ని ప్రారంబించనున్నారు. అనంతరం సమీపంలోనే నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబిస్తారు. అలాగే జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంబించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిఎం కేసీఆర్ పర్యటనను జిల్లా గులాబీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.