విత్తు నాటింది మొదలు పంట చేతికొచ్చే వరకు కష్టాల సాగు చేసే అన్నదాతలను ఒకే వేదిక కిందకు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు, నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రైతులు సాగు సమస్యలపై చర్చించడం ఎలా సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి, సస్యరక్షణ కోసం అవలంబించాల్సిన ఆధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకొనేందుకు నిర్మించిన రైతు వేదికలు సిద్ధమయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 6వందల ఒకటి రైతు వేదికలను సర్కార్ అన్నదాతలకు అంకితం చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్ల వ్యయంతో 2వేల 601 రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఇందులో 2వేల 4వందల 62 గ్రామీణ ప్రాంతాల్లో, 139 పట్టణాల్లో ఉన్నాయి. ఒక్కో వేదికను 2వేల 46 చదరపు అడుగుల విస్తీర్ణంలో 22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 19 వందల 51 రైతు వేదికల నిర్మాణం పూర్తి కాగా, 650 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో భూవిరాళంతో నిర్మిస్తున్న రైతు వేదికలు 139 ఉన్నాయి.
రైతు వేదికలో రెండు గదులు, మరుగుదొడ్లు, విశాలమైన హాలు నిర్మిచడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ ఇచ్చారు. ప్రతి వేదికకూ విద్యుత్తు సదుపాయం కల్పించారు. ఈ రైతు వేదికల ద్వారా 58లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. రైతులకు సాగుపై శిక్షణ, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు పని చేయనున్నాయి.
సీఎం కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి నేరుగా జనగామ జిల్లా కొడకండ్లకు మధ్యాహ్నం 12గంటలకు చేరుకుంటారు. 12.10 గంటలకు కొడకండ్ల రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. 12.20 గంటలకు పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొడకండ్ల మండలం రామవరంలోని వైకుంఠధామం, డంపింగ్ యార్డు పనులను పరిశీలిస్తారు. 1.30కు తిరిగి కొడకండ్లకు చేరుకుని 10వేల మంది రైతులతో ముఖాముఖిలో మాట్లాడుతారు.