ఈ నెల 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దసరా మరుసటి రోజు సెలవుగా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది మాత్రమే కాకుండా ప్రతి ఏడాది దసరా మరుసటి రోజున సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు. 2019 జులై నుంచి ఉన్న బకాయి డీఏను ఉద్యోగులకు చెల్లించాలని ఆర్థికశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తామన్నారు. ప్రస్తుతం డీఏ ఎంత అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని అనుసరిస్తున్నాయి స్పష్టం చేశారు.
ప్రతి 6 నెలలకు రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలని, కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే సవరించాలని అధికారులకు సూచించారు. కేంద్రం జాప్యం వల్ల డీఏ బకాయిలు పేరుకుపోతున్నాయి విమర్శించారు. కేబినెట్‌లో చర్చించి డీఏపై విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడిందని అన్నారు. 2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్ర జీడీపీ కూడా మైనస్ 24 శాతానికి పడిపోయిన నేపథ్యంలో బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోరారు.