Huzurabad: సార్ స్కెచ్చేస్తే.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడేస్తారా?
Huzurabad: హైప్ మీద రైడ్ చేయాలి. ఇదే తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం. పక్కాగానే దాన్నే అమలు చేసి చూపిస్తారాయన.
Huzurabad: హైప్ మీద రైడ్ చేయాలి. ఇదే తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం. పక్కాగానే దాన్నే అమలు చేసి చూపిస్తారాయన. అందుకే ప్రతీ విషయాన్నీ, ప్రతీ అంశాన్ని పోలరైజ్ చేస్తారు. మాటు వేసి వేటేస్తారు. సమకాలీన రాజకీయాల్లో దూరదృష్టి గల నేతగా ఉద్దండ పిండంగా, గండరగండడుగా పేరొందిన కేసీఆర్ ఏదైనా ఆలోచించి పూర్తి విశ్వాసం ఉంటేనే కానీ ముందడగు వేయరు. అన్నింటినీ ఒక దగ్గరికి చేర్చాకే ఒక నిర్ణయానికి వస్తారు. దానిపై మాట్లాడుతారు. దాని గురించే మాట్లాడిస్తారు. కేసీఆర్ వేసే ఈ ఎత్తుగడల వెనుక ఓ బీభత్సమైన కథే నడుస్తుంది. అనుకోని వేవ్ పెరుగుతుంది. తెలంగాణలో కొన్ని నెలలుగా జరుగుతున్న కొన్ని పరిణామాలు కేసీఆర్ చాణక్యనీతిని, ఆయన రాజకీయ చతురతను మరోసారి రుచి చూపిస్తున్నాయ్. ఇంతకీ ఏంటవి? కేసీఆర్ ఆలోచన ఏంటి? హుజూరాబాద్‌పై ఆయన వ్యూహం ఏంటి?
హుజురాబాద్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. హుజురాబాద్‌లో ప్రచారం ఎలా జరుగుతుంది ఇతర పార్టీల నేతలు ఎక్కడ ప్రచారం చేపడుతున్నారు ఈటల వెంట ఎవరు నడుస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు. అలాంటి వారి దారిని ఎలా మళ్లించాలి పార్టీలోకి రప్పించుకోవాలి ఇలాంటి ప్లాన్స్‌కు ప్రగతిభవన్ ఫ్లాట్‌ఫామ్ నుంచే మానిటరింగ్ చేస్తున్నారట సీఎం కేసీఆర్.
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ విడుదలే చేయలేద, అప్పుడే అక్కడ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పరువు కోసం ప్రతిపక్షం ఆధిపత్యం కోసం అధికార పక్షం పోటాపోటీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఒకవైపు హామీల ప్రకటనలు, మరోవైపు నిధుల కేటాయింపులతో నియోజకవర్గంలోని ప్రజలను గులాబీ పార్టీ, తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం మరోసారి చేస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ నిరంతరం అక్కడి పరిస్థితులపై ప్రగతిభవన్ నుంచి సీఎం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీనియర్ మంత్రి ఒకరు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారట. హుజురాబాద్‌లో రాజకీయం హీట్టేక్కడంతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది టీఆర్ఎస్. నియోజకవర్గంలో మండలాలవారీగా కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన సర్కార్, ఈటల అనుచరులకు వల వేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ను విజయవంతంగా అమలు చేస్తోంది. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలతో గ్రౌండ్ లెవల్ సర్వేలు నిర్వహిస్తోంది. ఈటలకు ఇంకా సానుభూతి ఉందన్న భావనతో ఉన్న గులాబీ టీమ్ ట్రబుల్ షూటర్ హరీష్‌రావును రంగంలోకి దింపిందట. నిరంతరం అక్కడి తీరుపై మానిటరింగ్ చేసేలా చూస్తోందట.
సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో మంత్రి హరీష్‌రావు హుజురాబాద్‌లో పరిస్థితిని కిందటి నెల నుంచే ప్రగతిభవన్ నుంచి సమీక్షిస్తున్నారట. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్ ఇతర విద్యార్థి విభాగాలకు చెందిన పలవురు నేతలతో మంతనాలు జరుపుతున్నారట. తనకిష్టమైన సెంటిమెంట్ జిల్లాలో హుజురాబాద్ ఉపఎన్నికలో అధినేత తాజా వ్యూహాన్ని ద్వితీయశ్రేణి నాయకత్వానికి చెబుతూ సమాయత్తం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఈటలకు దీటైన అభ్యర్థి ఎవరా అని క్యాడర్ ఎదురుచూస్తున్నా ఆ లీకులేమీ ఇవ్వకుండా కేసీఆర్ హుజురాబాద్ ప్రగతిపైనే కేంద్రీకరించారన్న చర్చ నడుస్తోంది. ఎవరిని బరిలో నిలబెడితే గెలుస్తారనే దానికన్నా గ్రౌండ్‌లో ఉన్న అభ్యర్థికి ప్రజల మద్దతు ఎలా కూడబెట్టాలి శత్రువుతో సైకలాజికల్ మైండ్‌గేమ్ ఎలా ఆడాలి అన్న దానిపై ఆలోచిస్తున్నారట అధినేత. అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగేయడం సీఎం కేసీఆర్‌కు మొదట్నుంచీ అలవాటే. కుల, బల సమీకరణాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ప్రభావితం చేసే ప్రతిభావంతుని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఊరంతా చుట్టాలుంటే ఉరే మనదవుతుందన్న సామెతను సీఎం ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇరవై ఏళ్ల పార్టీ ప్రస్థాన సభతో పాటు 2వేల కోట్ల రూపాయలతో సుమారు 20 వేల దళిత కుటంబాలకు 10 లక్షల రూపాయలు ఒక్కో కుటుంబానికి ఆర్థికసాయం అందజేసేందుకు హుజురాబాద్‌ను వేదికగా ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. హుజురాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ రచిస్తున్న కొత్త అధ్యాయాలు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాయడంలో సందేహం లేదంటోంది గులాబీ గ్యాంగ్. ఒక్క దెబ్బకు హుజురాబాద్‌లో మూడు పిట్టలు అన్న కొత్త లక్ష్యాన్ని సీఎం చేధించబోతున్నారని క్యాడర్ చెప్పుకుంటోంది. వచ్చే 2023 ఎన్నికల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా, తిరుగులేని పార్టీగా టీఆర్‌ఎస్‌ను తయారు చేసేందుకు హుజూరాబాద్‌ను ఫ్లాట్‌ఫామ్‌గా చేసుకోవాలన్నది అధినేత ప్లానట. మరి సెంటిమెంట్ జిల్లాలో మొదలుపెట్టిన ప్రతి పని ఎలా సక్సెస్ అయిందో ఇప్పుడు కూడా హుజూరాబాద్‌లో అదే రిపీట్ చేస్తారో లేదో చూడాలి.