బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా? : సీఎం కేసీఆర్

Update: 2020-11-28 14:00 GMT

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నాయకుల పని తీరును బేరీజు వేసుకొని ఓటేయాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామన్నారు సీఎం కేసీఆర్‌. ఎన్నికల వేళ ఓటర్లు విచక్షణాధికారం వినియోగించుకోవాలన్న కేసీఆర్‌, ఓటర్లు ఎప్పుడూ నాయకుల విజన్‌నే చూడాలన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నీళ్లు రావు, కరెంటు ఉండదని కొందరు అబద్ధపు ప్రచారం చేశారంటూ ఫైరయ్యారు.

ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు సీఎం కేసీఆర్‌. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని తమ బిడ్డలుగానే చూస్తున్నామన్నారు సీఎం. ఉద్యమ బాధ్యత ముగిసిందన్న కేసీఆర్‌.. రాజకీయ పరిణతి సాధించామన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం సాధించిన తొలి ఘనత విద్యుత్‌ అన్న కేసీఆర్‌.. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌ అని కేంద్రమే చెప్పిందన్నారు‌. ఎంతో కృషి, పట్టుదలతో కోతలు లేని విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. తాగునీటి సమస్యకు భరతవాక్యం పలికామన్నారు సీఎం కేసీఆర్‌.

రాష్ట్ర విభజన జరిగితే నీళ్లు రావని కొందరు అన్నారని, కరెంటు రాదని ప్రచారం చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. కొత్త రాష్ట్రంలో నక్సలైట్లు పెరుగుతారని చెప్పారని, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. దేశంలో దిల్లీ తర్వాత హైదరాబాద్‌లోనే ఉచితంగా నీటి పంపిణీ చేసేందుకు ముందుకొచ్చామన్నారు. 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ గడ్డపై ఉన్న ప్రతిబిడ్డా మా వారే అని గతంలోనే చెప్పామని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నామని తెలిపారు. నగర ప్రజలకు, పేదలకు కేసీఆర్‌ అందించిన కానుక ఉచిత తాగునీరు అని అన్నారు. 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని అపార్ట్‌మెంట్‌ వాసులకూ వర్తింపజేస్తామన్నారు.

వరదల్లో పేదల బాధలు చూసి ఇంటికి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని, రూ.10 వేల సాయాన్ని ఏ నగరంలో ఇవ్వలేదని కేసీఆర్‌ అన్నారు. వరద సాయం అందిస్తే కొందరు కిరికిరి పెడుతున్నారని మండిపడ్డారు. ఎస్‌ఈసీని ఇబ్బందిపెట్టి రూ.10వేలు సాయం నిలిపి వేయించారని అన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత డిసెంబరు 7 నుంచి వరద బాధితులకు సాయం అందిస్తామన్నారు. వరద బాధితులకు సాయం చేయమని ప్రధానిని అడిగానని, రూ. 1300 కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ ఆరోపించారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌, బెంగళూరుకు సాయం అందించారని, మనం ఈ దేశంలో లేమా? అని ప్రశ్నించారు.

యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తలసరి ఆదాయంలో 25వ ర్యాంక్ లో ఉన్న యూపీ సీఎం వచ్చి 5వ ర్యాంక్ లో ఉన్న తెలంగాణలో ఉపదేశాలిస్తున్నారంటూ మండి పడ్డారు. బక్క కేసీఆర్‌ను కొట్టేందుకు దేశం నలుమూలల నుంచి బీజేపీ నేతలు వచ్చారంటూ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. దేశం గతి మార్చాలన్న కేసీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే దానికి నాంది పలకాలన్నారు. దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.

Tags:    

Similar News