మునుగోడుపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్

CM KCR: ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో అర్ధరాత్రి సమావేశం

Update: 2022-08-12 02:50 GMT

మునుగోడుపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్

CM KCR: రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలపడంతో మొదలైన మునుగోడు కాక.. తెలంగాణలోని ప్రధాన పార్టీలను పరుగులు పెట్టిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని కాంగ్రెస్, ఉప ఎన్నికలో విజయం ద్వారా.. అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతుండగా.. విపక్షాలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ సీరియస్ డిస్కషన్ చేస్తోంది. నిన్న మంత్రివర్గ సమావేశం తర్వాత.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రితో పాటు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో.. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. అర్ధరాత్రి దాటే వరకు కొనసాగిన ఈ మీటింగ్‌లో.. మునుగోడును కారు ఖాతాలో వేసుకునేందుకు అన్ని రకాల అవకాశాలపై చర్చించారు. ఈ నెల 20 న మునుగోడులో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మునుగోడులో ఉపఎన్నిక బీజేపీ కుట్రగా.. సీఎం కేసీఆర్ ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో తాను యాక్టీవ్ అవుతున్న సమయంలో.. దాన్ని అడ్డుకునే క్రమంలోనే ఈ ఉపఎన్నిక తీసుకొచ్చారని.. కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వదిలే ప్రసక్తే లేదని.. పార్టీ నాయకులతో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపఎన్నిక జరిగే వరకు చేపట్టాల్సిన కార్యాచరణపై క్లుప్తంగా చర్చ జరిగింది. అందులో భాగంగానే.. బీజేపీ బహిరంగ సభకు ఒకరోజు ముందే.. టీఆర్ఎస్ సభను నిర్వహించ తలపెట్టారు. మునుగోడు ప్రజాదీవెన పేరుతో లక్ష మందితో మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇవాళ సభా స్థలాన్ని పరిశీలించాలని.. జిల్లా నాయకులను ఆదేశించారు. సభను విజయవంతం చేసేందుకు మండలాల వారీగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. ఇటు ఎన్నిల పూర్తయ్యే వరకు మండలాలు, గ్రామాల్లో తిరుగుతూ.. ప్రజల్లో ఉండాలని.. స్పష్టం చేశారు.

మరోవైపు మునుగోడు టిక్కెట్ ఆశిస్తున్న నేతల మధ్య సమన్వయం.. కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. అసంతృప్తులు అడ్డుపుల్లలు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా సీఎం కేసీఆర్ జిల్లా నాయకులతో కూలంకషంగా చర్చించారు. జిల్లా నేతలను సమన్వయం చేసే బాధ్యత మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించారు. అయితే రేసులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అర్ధరాత్రి మీటింగ్ తర్వాత.. మాజీ ఎమ్మెల్యే క కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ అభ్యర్థి విషయంలో ఎలాంటి లీకులు ఇవ్వొద్దని సీఎం కేసీఆర్.. జిల్లా నాయకులకు సూచించారు.

Tags:    

Similar News