ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తాం: సీఎం కేసీఆర్‌

Update: 2020-09-05 12:21 GMT

కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దల అభిప్రాయాలు, సూచనలను కేసీఆర్ తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. సమావేశంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్ మౌలానా ముఫ్తీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు

• పాత సెక్రటేరియట్ భవనాలు కూల్చి వేస్తున్న సందర్భంలో అక్కడున్న మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లింది. వాటిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో నిర్మించాలని నిర్ణయించాం.

• ఒక్కొక్కటి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్ తో సహా రెండు మసీదులు (మొత్తం 1500 చదరపు అడుగులు) ప్రభుత్వం నిర్మిస్తుంది. పాత సెక్రటేరియట్ లో ఉన్న స్థలంలోనే మసీదుల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మసీదులను వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తుంది.

• 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిరం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖకు మందిరాన్ని అప్పగిస్తుంది.

• కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో తమకు కూడా ప్రార్థనా మందిరం కావాలన్న క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది.

• తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. పరమత సహనం పాటిస్తుంది. గంగా జమునా తహజీబ్ కు ప్రతీక. అందుకే కొత్త సెక్రటేరియట్ లో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు నిర్మిస్తాం. అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్నింటికి ఒకే రోజు శంకుస్థాపన చేస్తాం.

• ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య నేర్పించే అనీస్ – ఉల్ – గుర్భా నిర్మాణం వేగవంతం చేస్తాం. ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తయింది. మరో 18 కోట్లు అవసరమవుతాయి. వాటిని వెంటనే విడుదల చేసి, నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తాం.

• అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఇస్లామిక్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్థలం కూడా కేటాయించింది. కరోనా పరిస్థితుల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది. వెంటనే ఈ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.

• హైదరాబాద్ నగరం చుట్టూ ఖబ్రస్థాన్ లు రావాల్సిన అవసరం ఉన్నది. స్థలాలు సేకరించాలని ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను కోరాం. వారు కొన్ని స్థలాలు గుర్తించారు. నగరంలోని వివిధ చోట్ల మొత్తం 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్ లు ఏర్పాటు చేస్తాం.

• నారాయణపేటలో రోడ్ల వెడల్పు కార్యక్రమం సందర్భంగా పీరీల చావడి అయిన అసుర్ ఖానాకు నష్టం వాటిల్లింది. దీనికి స్థలం కేటాయించి, నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ను ఆదేశించాం.

• రాష్ట్రంలో ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తిస్తున్నాం. ఉర్ధూ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడతాం. అందుకోసం అధికార భాష సంఘంలో ఉర్దూ భాషాభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. అధికార భాష సంఘంలో ఉర్దూ భాషకు సంబంధించిన వ్యక్తిని ఉపాధ్యక్షులుగా నియమిస్తాం.

Tags:    

Similar News