KCR: వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

KCR:*వ్యవసాయశాఖ సన్నద్ధతపై అధికారులతో చర్చ

Update: 2022-04-20 03:00 GMT

వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

KCR: వానాకాలం పంటలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు సూచన చేశారు. వ్యవసాయ రంగంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ యాసంగి వరి ధాన్యం సేకరణ ఏర్పాట్ల తీరుపై చర్చించారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారత దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుందంటూ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న దేశ రైతాంగాన్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం, దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

రాష్ర్టంలో ఇప్పటికే వానాకాలం మరికొద్ది నెలల్లో రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. పత్తి, మిర్చి, కంది వాటర్ మిలన్, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపత్యంలో ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాల తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయ రంగానికి ఇక కరువు అనే సమస్యే ఉత్పన్నం కాదన్నారు సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగం బలోపేతానికి, జిల్లా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లను, ఆర్డీవోలను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. యూరియా, ఎరువుల వాడకాన్ని తగ్గించి, శాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తూ, మోతాదుగా వాడేలా రైతులకు అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. విపరీతమైన ఎరువులు, పురుగుమందుల వాడకం తో భూములు పాడవుతాయన్నారు. పంటలమార్పిడి చేయకుండా వొకే పంటనే ఏండ్ల కొద్దీ వేయడం ద్వారా, నేల సహజ స్వభాఃవం తగ్గి రోజు రోజుకూ భూసారాన్ని కోల్పోతున్నదని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. పంటల మార్పిడితో భూసారాన్ని పరిరక్షించుకోవడం తక్షణావసరమని సిఎం అన్నారు. ఈ దిశగా తగు ప్రణాళికలను సిద్దం చేసుకుని రైతులను చైతన్య పరచాలని మంత్రిని, అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత దళిత బంధు అమలు తీరుతెన్నులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. అర్హులైన లబ్దిదారులకు మరింత వేగంగా పథకం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  

Tags:    

Similar News